రత్నాల్లాంటి పిల్లలకు ఆపద.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు.. Brothers Suffered With Same Disease : గుంటూరు నగరం గోరంట్లకు చెందిన పేరం హరి, రమాదేవికి ఇద్దరు పిల్లలు. చూసేందుకు ఎంతో ముచ్చటగొలిపే ఈ పిల్లలిద్దరూ ప్రస్తుతం ఒక చోట నుంచి మరోచోటికి కదల్లేరు. కనీసం పాకలేరు. ఇదివరకు బాగానే ఉన్న చిన్నారులు.. 9నెలల నుంచి ఇలా అయిపోయారు. మస్కులర్ డిస్ట్రోఫి అనే కండరాల జబ్బు కారణంగా కాళ్లు, శరీరం చచ్చుబడిపోయాయి. మొదట పెద్దబ్బాయి జయకృష్ణ ఉన్నట్టుఉండి కూలబడిపోయాడు. చికిత్స చేయిస్తున్న సమయంలోనే చిన్నోడు సాయిరాంకు కూడా అలాగే కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆటపాటలతో సరదాగా ఉండే పిల్లలు ఒక్కసారిగా లేవలేని స్థితిలోకి వెళ్లిపోవడాన్ని చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.
ఇద్దరు కుమారుల్ని గుంటూరు జీజీహెచ్, N.R.I, ఎయిమ్స్ ఆసుపత్రితో పాటు తిరుపతి స్విమ్స్‌లోనూ చూపించారు. రకరకాల పరీక్షలు చేసి మందులు రాసిచ్చారు. జన్యుపరమైన లోపాల వల్ల ఈ వ్యాధి వస్తుందని వైద్యులు చెప్పారు. ఆధునిక చికిత్స అందిస్తే పిల్లలు లేచి తిరిగే అవకాశముందన్నారు. చెన్నైలోని ఓ ఆసుపత్రికి వెళ్లి వాళ్లు అడిగిన డబ్బు కట్టలేక తిరిగొచ్చేశారు. బండిపై తిరిగి పండ్లు అమ్మితే వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించే హరి... పిల్లల అనారోగ్యాలతో భారమైన బతుకుబండిని లాగలేక కొట్టుమిట్టాడుతున్నాడు.
"చెన్నై ఆసుపత్రిలో చేర్పించడానికి వెళ్తే రూ.5 లక్షలు అడిగారు. ఇంక చికిత్సకి ఎంత అడుగుతారో తెలీదు. ఆసుపత్రిలో చికిత్స చేయించే స్థోమత లేక తిరిగి గుంటూరుకు తిరిగి వచ్చాము. రోజు పనికి వెళ్లి వస్తేనే పూట గడుస్తుంది. పిల్లలు బడికి వెళ్లకపోవడం వల్ల అమ్మఒడి లో పేరు తీసేశారు. ఫించన్ డబ్బులు వస్తే పిల్లల మందులకు అన్న వస్తాయమో అనుకుంటే ఆ ఆశ కూడా లేకుండా పోయింది. ప్రభుత్వం కాస్తా దయ తలచి ఆదుకోవాలి" -పేరం హరి, బాధిత చిన్నారుల తండ్రి
జయకృష్ణ మూడో తరగతి, సాయిరాం రెండో తరగతి వరకూ చదివారు. పెద్దబ్బాయికి రెండేళ్ల పాటు అమ్మఒడి అందింది. జబ్బుబారిన పడి బడికి వెళ్లలేకపోవడంతో పేరు తొలగించారు. అమ్మఒడి పథకం ఆగిపోయింది. పిల్లలిద్దరి మందులకు నెలకు 10వేల వరకూ ఖర్చవుతుంది. ప్రస్తుతం మందులు కొనేందుకు వీరి వద్ద డబ్బులు లేవు. పిల్లలకు వికలాంగుల పింఛన్ కోసమని సదరం సర్టిఫికెట్ కు దరఖాస్తు చేశారు. ఐదు నెలలు దాటినా ఇంకా పరీక్షల కోసం సమయం కేటాయించలేదు. పింఛన్ వస్తే కనీసం పిల్లల మందులకైనా ఉపయోగపడతాయని అనుకుంటుంటే వారి ఆశ నెరవేరడం లేదు. గతంలో కూలీపనులకు వెళ్లే తల్లి రమాదేవి ఇప్పుడు పిల్లల్ని చూసుకునేందుకు ఇంటి వద్దే ఉంటోంది.
"పిల్లలందరూ బడికి వెళ్తుంటే మా పిల్లలు ఇలా ఉండటం చాలా బాధాకరంగా ఉంది. ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం. పిల్లల మందులకు నెలకు వేలల్లో ఖర్చు అవుతుంది. సదరం సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తే ఇప్పటి వరకు ఏ సమాచారం లేదు. డబ్బులు లేక మందులు కూడా కొనడం లేదు. ఎక్కడ డబ్బులు అడుగుతామో అని బంధువులు కూడా ముఖం చాటేశారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుని పిల్లల ఆరోగ్యానికి సాయం అందించాలని వేడుకుంటున్నాం"-పేరం రమాదేవి, బాధిత చిన్నారుల తల్లి
ప్రస్తుతం చిన్నారుల కాళ్లు, నడుము వరకూ శరీరం చచ్చుబడిపోయింది. రానురానూ శరీరం పైకి విస్తరించి మనిషిని అచేతనంగా మార్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. పిల్లల అనారోగ్యంతో ఆర్థికంగా చితికిపోయిన హరి కుటుంబాన్నికనీసం బంధువులు కన్నెత్తి చూడటం లేదు. జగనన్న కాలనీల్లో ప్రభుత్వం స్థలం కేటాయించినా...కట్టుకునే స్థోమత లేక వదిలేశారు. పిల్లల్ని బతికించుకునేందుకు.... దిక్కుతోచని స్థితిలో ఈ తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి: