జూదం ఆడటం కోసమే పేకాటరాయుళ్లు గోవా, హైదరాబాద్, బెంగళూరు, శ్రీలంక రాజధాని కొలంబో, మకావు ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు, క్యాసినోలకు వెళ్లేవారు. వీరు రోజూ రూ.లక్షల నుంచి కోట్లలో జూదం ఆడతారు. కరోనా కారణంగా క్యాసినోలు, పేకాట క్లబ్బులు మూతపడ్డాయి. విదేశాలకు వెళ్లే పరిస్థితి లేదు. కరోనా లాక్‌డౌన్, కర్ఫ్యూ పరిస్థితుల్లోను గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ప్రత్యేకంగా గుడారాలు వేసి ఏసీలు ఏర్పాటు చేసి సకల సౌకర్యాలతో చేసి వారిని ఆకర్షిస్తున్నారు. గతంలో పోలీసులు దాడులు చేసినా ముందుగానే సమాచారం అంది ప్రముఖులు, కీలకమైన వ్యక్తులు తప్పించుకున్న సంఘటనలు అనేకం.
నిజాంపట్నం శివారు చింతరేవు, ముండ్రేడు సమీపంలోని రొయ్యల చెరువుల వద్ద రెండు పేకాట స్థావరాల్లో భారీగా జూదం ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో ముందస్తుగా సమాచారం లీకు కాకుండా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, పోలీసులు మూడ్రోజుల కిత్రం మెరుపు దాడులు చేసి 79 మంది జూదరులు, నిర్వాహకులను అదుపులోకి తీసుకొని రూ.48,75,565 నగదు, 42 కార్లు, 24 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు రూ.అర కోటి నగదు స్వాధీనం చేసుకున్నాక సంచలనం సృష్టించింది. పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నా జూదం కేంద్రాల నిర్వాహకులు స్థావరాలు మారుస్తూ దందా కొనసాగిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి, నిజాంపట్నం ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తుల సహకారంతో ఏడాదికి పైగా జూదం కేంద్రాలు నిర్వహిస్తూ భారీగా అర్జిస్తున్నారు. స్థానికంగా ఒక నేత పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పేకాట రాయుళ్లతో పాటు హైదరాబాద్ నుంచి కాసుల సంచులు తీసుకొని ఖరీదైన కార్లలో నిజాంపట్నం వచ్చి జూదం ఆడుతున్నారు. పెద్ద భవనాన్ని తీసుకుని సకల వసతులు సమకూర్చారు. రోజూ లావాదేవీలు రూ.రెండు కోట్ల పైన ఉందంటే జూదం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. నగదు లెక్కించటానికి యంత్రాలు ఏర్పాటు చేశారు.
జూదంలో తెచ్చుకున్న నగదు పోతే అక్కడిక్కడే ఆస్తులు తనఖా పెట్టుకుని, ప్రాంసరీ నోట్లపై సంతకాలు చేయించుకొని పందాలు ఆడేవారికి నిర్వాహకులు రూ.లక్షల్లో రుణాలిస్తున్నారు. సంక్రాంతి సీజన్ సమయంలో హార్బర్ సమీపంలోని ఒక రహస్య ప్రాంతానికి పందెంరాయుళ్లు పడవల్లో చేరుకుని భారీగా పేకాట, కోళ్ల పందాలు ఆడారు. జిల్లా ఎస్పీ ఆదేశాలలో పోలీసులు పేకాట స్థావరాలపై మూడు సార్లు మెరుపు దాడులు చేసినా భారీగా నగదు దొరకలేదు. కొద్ది మొత్తంలో నగదు, జూదరులు మాత్రమే పట్టుబడ్డారు. బడాబాబులు తప్పించుకున్నారు.
ఒక ప్రైవేట్ రిసార్ట్స్‌లో...