Tenali Talika School Closed Due to GO 117: 50 కాదు 100 కాదు.. ఏకంగా 120 ఏళ్ల చరిత్ర ఆ పాఠశాల సొంతం. పరాయి పాలకుల బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడిన ఎందరో యోధుల్ని అందించిన విద్యా కేంద్రమది. తెనాలి పరిసర ప్రాంతాల్లోని వేలాది నిరుపేద పిల్లలకు చదువు నేర్పిన సరస్వతి నిలయం. సినీ, రాజకీయ, వ్యాపార, విద్య, వైద్య రంగాల్లో దేశం మెచ్చే ప్రముఖులను తీర్చిదిద్దిన అత్యుత్తమ విద్యా కుసుమం తెనాలి తాలుకా ఉన్నత పాఠశాల. ఇంతటి ప్రత్యేకలు సొంతం చేసుకున్న ఈ విద్యాలయం.. జగన్ ప్రభుత్వం తెచ్చిన 117 జీవో, విలీన ప్రక్రియ కారణంగా మూతపడింది. ఎందరో విద్యావంతుల్ని అందించిన పాఠశాల కీర్తి ప్రతిష్టలు ఒక్క జీవోతో ఇకపై చరిత్రగానే మిగిలిపోనుంది.
ఉమ్మడి గుంటూరు జిల్లా మొదటి హైస్కూల్: తెనాలి తాలూకా హైస్కూల్ ఉత్తమ విద్యా సంస్థగా ఎంతోమంది ప్రముఖుల మన్ననలను అందుకుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే మొదటి ఉన్నత పాఠశాలగా గుర్తింపు పొందింది. తెనాలి పరిసర ప్రాంతాల పిల్లలు చదువుకునేందుకు పడుతున్న ఇబ్బందులు చూసి పట్టణానికి చెందిన కొందరు దాతలు ముందుకు వచ్చి స్థలాన్ని కేటాయించారు. ప్రభుత్వం పాఠశాల భవనం నిర్మించడానికి నిధులిచ్చింది. ఎట్టకేలకు ఏడుగురిని ట్రస్టీలుగా ఏర్పాటు చేసి, 1903లో పాఠశాలను నిర్మించారు. అలా ఏర్పాటైన తెనాలి తాలుకా హైస్కూల్ అనతి కాలంలోనే నాణ్యమైన బోధనతో ఉత్తమ పాఠశాలగా గుర్తింపు తెచ్చుకుంది. ఫలితంగా ఆ పాఠశాలలో ప్రవేశానికి తీవ్ర పోటీ ఉండేది.
'చదువుకు దూరమవుతున్నాం.. మూతపడిన 40 పాఠశాలలు తెరవండి'
ఎందరో మహనీయులు ఇక్కడి నుంచే: తెనాలిలో తాలుకా హైస్కూల్ది కీలకపాత్రే అని విద్యావేత్తలు చెబుతుంటారు. 1965లో ప్రభుత్వం తాలుకా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడంతో.. ఈ విద్యా సంస్థ ఖ్యాతి మరింతగా విస్తరించింది. సూపర్ స్టార్ కృష్ణ, మహర్షి రాఘవ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ నాదెండ్ల మనోహర్ లాంటి ప్రముఖులు ఈ విద్యాసంస్థల్లోనే ఓనమాలు దిద్దారు.