Telugu States are Top in guaranteed loans :ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకునే రుణాలకు పూచీకత్తు ఇవ్వడంలో తెలుగు రాష్ట్రాలు దేశంలో అగ్రస్థానంలో ఉన్నాయని రిజర్వుబ్యాంకు వెల్లడించింది. ‘రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం-2021-22’ పేరుతో ఆర్‌బీఐ వెలువరించిన తాజా నివేదికలో ఏ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? నేరుగా తీసుకున్న అప్పులెన్ని? రుణాలకు పూచీకత్తు ఇచ్చిందెంత? అనే వివరాలను పేర్కొంది.
గతేడాది (2021-22) నాటికి దేశంలో అన్ని రాష్ట్రాలు.. ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రూ.5 లక్షల కోట్ల రుణాలకు పూచీకత్తు ఇచ్చాయి. వీటిలో అత్యధికంగా రూ.1,35,282.50 కోట్లతో తెలంగాణ, రూ.1.17,503.1 కోట్లతో ఏపీ, రూ.91,975 కోట్లతో తమిళనాడు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. రూ.5 లక్షల కోట్లలో ఈ మూడు రాష్ట్రాలవే 68.8 శాతం ఉండటం గమనార్హం.
మార్కెట్ల నుంచి మరిన్ని అప్పులు..:ప్రభుత్వరంగ సంస్థలు తీసుకునే అప్పులకు పూచీకత్తు ఇవ్వడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా మార్కెట్ల నుంచి తీసుకునే రుణాలు సైతం విడిగా ఉంటున్నాయి. ఇలా గతేడాది దేశంలోకెల్లా అత్యధికంగా తమిళనాడు రూ.87,000 కోట్లు, మహారాష్ట్ర రూ.68,750 కోట్లు, పశ్చిమబెంగాల్ రూ.67,390 కోట్లను తీసుకొని తొలి 3 స్థానాల్లో నిలిచాయి. ఏపీ రూ.46,443 కోట్ల రుణం తీసుకోగా తెలంగాణ రూ.45,716 కోట్లు తీసుకుంది.
అన్ని రాష్ట్రాలు కలిపి 2021-22లో రూ.7.01 లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చి బకాయిలకు రూ.2.09 కోట్లు చెల్లించాయి.