తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపు రద్దు - తెలంగాణకు సీఎస్ సోమేష్ కుమార్ కేటాయింపు క్యాన్సిల్
TS CS Somesh Kumar Allotment Cancelled: తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో గతంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
TS CS Somesh Kumar Allotment Cancelled
By
Published : Jan 10, 2023, 11:43 AM IST
|
Updated : Jan 10, 2023, 1:04 PM IST
TS CS Somesh Kumar Allotment Cancelled : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రావిర్భావం నుంచి కొనసాగుతున్న సోమేశ్ కుమార్ కేటాయింపు వివాదానికి తెరదించుతూ.. ఆయన ఏపీకి వెళ్లాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2014లో రాష్ట్ర విభజన వేళ అఖిల భారత స్థాయి ఉద్యోగుల విభజనలో భాగంగా సోమేశ్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. దీనిని సవాల్ చేస్తూ అప్పట్లో ఆయన కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.
TS CS Somesh Kumar Allotment issue : సోమేశ్ పిటిషన్‌ను విచారించిన క్యాట్.. ఆయన్ను తెలంగాణకు కేటాయిస్తూ 2016లో ఉత్తర్వులు జారీచేసింది. అప్పటి నుంచి సోమేశ్ కుమార్ తెలంగాణలోనే కొనసాగుతున్నారు. కాగా.. క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసింది. సోమేశ్ కుమార్‌కు సంబంధించి క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ కేంద్రం పట్టుబడగా.. ఇలాంటి నిర్ణయాలతో రెండు రాష్ట్రాల్లో సీనియార్టీ గొడవలు తలెత్తుతాయని, బ్యూరోక్రాటిక్ బ్యాలెన్స్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది.
మూడు వారాలు నిలిపివేయండి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సోమేశ్ కుమార్ తరపున సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం కొన్ని నెలల క్రితం తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా.. సీఎస్ సోమేశ్‌కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై ఎట్టకేలకు కీలక తీర్పును హైకోర్టు వెలువరించింది. ఈ వ్యవహారంలో గతంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తెలంగాణలో సీఎస్ సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. అప్పీల్ కోసం తీర్పు అమలు 3 వారాలు నిలిపేయాలని సోమేశ్‌కుమార్ తరఫు న్యాయవాది కోరగా... ఆయన అభ్యర్థను న్యాయస్థానం తోసిపుచ్చింది.
నెక్స్ట్ ఏంటి..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ 2019 డిసెంబరు 31న బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తొలి సీఎస్‌గా సోమేశ్‌కుమార్ నిలిచారు. దేశంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న సీఎస్‌లలో సోమేశ్‌కుమార్ ఒకరిగా ఉన్నారు. రెవెన్యూ, ఆబ్కారీ, వాణిజ్యపన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, భూపరిపాలన కమిషనర్ వంటి కీలక పోస్టులనూ ఆయనే నిర్వహిస్తున్నారు. భూ రికార్డుల కంప్యూటరీకరణకు ఉద్దేశించిన ధరణి వెబ్‌సైట్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. 2023 డిసెంబరు 31 వరకు సోమేశ్ పదవీకాలం ఉండగా.. తాజాగా హైకోర్టు తీర్పుతో తదుపరి కార్యాచరణపై ఆసక్తి నెలకొంది.