TDP LEADERS ON VIVEKA MURDER CASE: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యతో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం అతని అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో నవీన్.. వైఎస్ భారతితో మాట్లాడటం, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి.. జగన్‌తో మాట్లాడటం, వారి కాల్ డేటా సమాచారం, గూగుల్ టేకౌట్లో వాళ్ల లొకేషన్లు సీబీఐ కనిపెట్టేసి, అవినాష్ రెడ్డే హత్యకు ప్రధాన కారకుడని తేల్చింది సజ్జలకు కనిపించడంలేదా అని నిలదీశారు. అన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నా హత్యతో అవినాష్‌కి సంబంధం లేదని చెప్పడం అతని దివాలాకోరుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ అధికారం, అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయలు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా కాపాడలేవని హెచ్చరించారు. టీడీపీ ముద్రించిన "జగనాసుర రక్తచరిత్ర" పుస్తకానికి సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు, సజ్జలకు ఉందా అని నిలదీశారు. జగనాసుర రక్తచరిత్ర పుస్తకంపై బహిరంగ చర్చకు సజ్జల సిద్ధమా అని సవాల్ విసిరారు. తన తండ్రి హత్య కేసు ఈ స్థాయికి తీసుకురావడానికి వీరోచిత పోరాటం చేసిన వివేకా కూతురు సునీతకు అభినందనలు తెలిపారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదని.. ముఖ్యమంత్రి దంపతులను విచారించకా తప్పదన్నారు.