వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు దోచుకునేందుకే.. దివాలా తీసిన కంపెనీకి ఇసుక తవ్వకాల బాధ్యత అప్పగించారని గుంటూరు తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ విమర్శించారు. గతంలో సూట్‌కేస్ కంపెనీలు పెట్టి వేల కోట్లు కొల్లగొట్టిన చరిత్ర సీఎం జగన్‌కు ఉందని పార్టీ కార్యాలయంలో విమర్శించారు. ఇపుడు ఇసుకనూ అదే తరహాలో దోపిడీ చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 21నెలల్లో.. మూడుసార్లు ఇసుక పాలసీ మార్చిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులకు అధికారాలు అప్పగించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. కేంద్రంతో కుమ్మక్కై.. ప్రైవేట్ సంస్థలకు విశాఖ ఉక్కుని అప్పగించేందుకు సీఎం జగన్ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో తమకు సంబంధం లేదని ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. పరిశ్రమను కాపాడుకునేందుకు ఈనెల 26న జరగనున్న బంద్‌లో తెదేపా శ్రేణులు పాల్గొంటాయని తెలిపారు. అనంతరం స్థానిక ఎంపీ గల్లా జయదేవ్ పుట్టినరోజు సందర్భంగా.. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు.