ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 15, 2021, 7:51 PM IST

ETV Bharat / state

పన్ను పెంపు జీవోలను రద్దుచేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పన్నుల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా, వామపక్షాల ఆధ్వర్యంలో నగర, మున్సిపల్ కార్యాలయల ఎదుట సీఐటీయూ నాయకులు ఆందోళన చేపట్టారు. పెంచిన ఆస్తి పన్ను, వినియోగదారుల ఛార్జీలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని నాయకులు డిమాండ్ చేశారు.

tdp and cpi statewide protest
ఆస్తిపన్ను పెంపుపై ఆందోళనలు

పెంచిన ఆస్తి పన్నును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా, వామపక్ష, సీఐటీయూ నాయకులు మున్సిపల్ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పన్నులు పెంచడం ఏంటని నాయకులు ప్రశ్నించారు.

కరోనా సంక్షోభంలో ఆస్తి, చెత్తపై పన్ను వేసి ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెదేపా గుంటూరు పశ్చిమ సమన్వయకర్త కోవెలమూడి రవీంద్ర మండిపడ్డారు. పెంచిన ఆస్తి పన్ను, చెత్త పన్నులను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ.. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కమిషనర్​ని కలసి వినతి పత్రం అందచేశారు.

విజయవాడలో..

ఆస్తి పన్ను, చెత్తపన్ను ఇతర పన్నులను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.196, 197, 198 లను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతూ విజయవాడలో అఖిలపక్షం ఆధ్వర్యంలో తూర్పు నియోజక వర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అశోక్ నగర్ లోని సచివాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో శాసన సభ్యులు గద్దె రామ్మోహన్​తో పాటు అఖిల పక్ష నేతలు నిరసనలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విశాఖలో..

ప్రజలపై పన్నుల భారం వేయడం వైకాపా ప్రభుత్వానికి పరిపాటుగా మారిందని విశాఖ జిల్లా మద్దిల పాలెంలో సీపీఎం,సీఐటీయూ నాయకులు విమర్శించారు. ఆస్తి పన్ను, వినియోగదారుల ఛార్జీలు తగ్గించకపొతే నగర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

కర్నూలులో..

కరోనా కష్టకాలంలో.. ఆస్తిపన్ను, వినియోగదారుల ఛార్జీలను పెంచడం శోచనీయమని కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. పన్నుల భారాలకు వ్యతిరేకంగా.. అఖిలపక్షం చేపట్టిన రెండ్రోజుల నిరసన కార్యక్రమాలకు సంఘీభావం తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులతో ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

ప్రకాశంలో..

ఆస్తి, చెత్తపై పన్నుల పెంపును నిరసిస్తూ చీరాలోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ విడుదల చేసిన జీవో ప్రతులను కాల్చివేశారు. జీవోను వెంటనే రద్దు చేయాలని లేకుంటే ఉద్యమిస్తామని నాయుకుల హెచ్చరించారు.

గుంటూరులో..

ఆస్తి పెంపు కోసం విడుదల చేసిన జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. అఖిలపక్షం, ప్రజా సంఘాల నేతలు చిలకలూరిపేట పురపాలక సంఘం కార్యాలయం వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పురపాలక కమిషనర్​కు వినతిపత్రం అందజేశారు.

పురపాలక సంఘం ఎన్నికలకు ముందు ఎటువంటి పన్నులు పెంచబోమని హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఎన్నికలు అయ్యాక, రాష్ట్ర ప్రజలను నిట్టనిలువునా మోసం చేసిందని తెదేపా నేత ఇనగంటి జగదీష్ దుయ్యబట్టారు. ప్రస్తుతం చట్టంలో 15 శాతంకు మించి పన్నుల పెంపుదల ఉండబోదని చెబుతున్నా..100 నుంచి 200 శాతం వరకూ పన్నులు పెరిగే అవకాశం ఉందని, ఇది ప్రజలను మోసం చేయడమే ఆయన అన్నారు.

ఇదీ చదవండి:

Suicide Note: 'సీపీ గారు..నా శవాన్ని అనాథలా దహనం చేయండి'

కరోనా టీకాతో దేశంలో తొలి మరణం

ABOUT THE AUTHOR

...view details