TB Cases in Telangana :తెలంగాణ రాష్ట్రంలో క్షయ (టీబీ) మహమ్మారి బాల్యాన్ని కబళిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నా.. ఏళ్లుగా పట్టి పీడిస్తున్న ఈ వ్యాధి సమూల నిర్మూలన సాధ్యం కావడం లేదు. పెద్దలు, పిల్లలు కలిపి ఏటా 60 వేల మందికి పైగా టీబీ కోరల్లో చిక్కుకుంటున్నారు. 2022లో మొత్తం బాధితుల సంఖ్య 64 వేలకు చేరింది. వీరిలో సుమారు 8 శాతం మంది 15 ఏళ్లలోపు వయసు పిల్లలుండటం గమనార్హం. హైదరాబాద్‌లో 15 శాతానికి పైగా పిల్లలు క్షయ బారిన పడుతున్నారు. రాష్ట్రంలో క్షయ పీడిత బాలలు 2017లో 10 శాతం నమోదయ్యారు. 2022 నాటికి అది 8 శాతానికి తగ్గినా.. పూర్తి నివారణ ఇంకా సుదూరంగానే ఉంది. పరిపూర్ణ చికిత్స పొందిన వారిలో దాదాపు 90 శాతం మంది వ్యాధిని పూర్తిగా జయించారని గణాంకాలు చెబుతున్నాయి. అవగాహన లేమి కారణంగా ఏటా పిల్లలు, పెద్దలు కలిపి రెండు వేల మందికి పైగా క్షయ కారణంగా చనిపోతున్నారు. పెద్దల్లో సుమారు 3 శాతం, పిల్లల్లో 1 శాతం మరణాలు సంభవిస్తున్నాయి.
టీకా ఇస్తున్నా..:శిశువు పుట్టిన 24 గంటల్లోపు క్షయను నివారించే బీసీజీ టీకా ఇస్తారు. లేదా పుట్టిన రెండేళ్లలోపు ఎప్పుడైనా ఇప్పించవచ్చు. పుట్టే శిశువుల్లో దాదాపు 99 శాతం మందికి బీసీజీ ఇస్తున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతుండగా.. క్షయ బాధిత బాలలు ఇంకా 8 శాతం ఉండడమేమిటన్నది ప్రశ్న. పిల్లలకు 10-12 ఏళ్లు వచ్చేసరికి టీకా సమర్థత తగ్గడం దీనికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి బారిన పడుతున్న పిల్లల్లో 70 శాతం మంది 12-15 ఏళ్ల వయసు వారే. వ్యాధి సోకే పిల్లల్లో 3-5 శాతం మందికి మాత్రమే మందులు ఇవ్వగలుగుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులతో పాటు ఇళ్ల వద్ద కాన్పు జరిగినా.. శిశువులకు కచ్చితంగా బీసీజీ టీకా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
ఇంట్లో పెద్దలకు సోకితే..:జుట్టు, గోళ్లు మినహా అన్ని అవయవాలకూ క్షయ సోకే అవకాశాలున్నాయి. ఎక్కువగా ఊపిరితిత్తులు, ఎముకలు, పేగులు, మూత్రపిండాలు, మెదడు, వెన్నెముక, శోషరస గ్రంథుల (లింఫ్ నోడ్స్)కు సోకుతుంది. ఇంట్లో పెద్దవారిలో ఎవరికైనా క్షయ సోకితే.. ఆ ఇంట్లో ఆరేళ్లలోపు పిల్లలందర్నీ పరీక్షిస్తారు. పెద్దల నుంచి వారికి సోకకుండా ఉండేందుకు ‘ఐసోనియాజిడ్ (ఐఎన్‌హెచ్)’ మాత్రలు ఇస్తారు. వాటిని ఆరు నెలలపాటు తప్పనిసరిగా వాడాలి. సుమారు 10 శాతం మంది పూర్తిస్థాయిలో మందులు వాడకపోవడంతో ప్రమాదకరంగా పరిణమిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
పిల్లల్లో లక్షణాలివీ..
* పెద్దల్లో మాదిరిగా తీవ్ర దగ్గు ఉండదు.
* ఆకలి తగ్గిపోతుంది. తినాలని బలవంతం చేస్తే ఏడుస్తారు.