R5 Zone Issue: ఆర్ 5 జోన్‌పై దాఖలైన పిటిషన్లపై వచ్చేవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాజధాని అమరావతి రైతులు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై వెంటనే విచారణ చేపట్టాలని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ధర్మాసనం ముందు న్యాయవాదులు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆర్ 5 జోన్ పిటిషన్లపై వచ్చేవారం విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రకటించారు.
తొలుత హైకోర్టు ఏం చెప్పిందంటే:ఆర్-5 జోన్‌పై రైతులు వేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. ఇళ్ల స్థలాల పంపిణీ అనేది తుది తీర్పునకు లోబడి ఉండాలని తెలిపింది. ఇందులో భాగంగా స్థానికేతరులకు పట్టాలు ఇవ్వడంపై రైతుల అనుబంధ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. అమరావతిలో 1,100 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సీఆర్‌డీఏ ఒప్పందం ప్రకారం అభివృద్ధి ఎందుకు చేయడం లేదని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రాజధాని భూములపై వేరేవారికి హక్కులు కల్పించకుండా ఆదేశించాలని.. జీవో 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రాజధాని రైతులు పిటిషన్ వేశారు. ఈ మేరకు రైతులు, ప్రభుత్వం తరఫున వాదనలు విన్న ధర్మాసనం ఈ విధంగా తీర్పుని ఇచ్చింది.
హైకోర్టు తీర్పు తర్వాత.. వేగం పెంచిన ప్రభుత్వం:హైకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆర్ 5జోన్‌లో ఇళ్ల స్థలాల మార్కింగ్ చేపట్టారు. సుమారు 100 మంది సిబ్బంది కృష్ణాయపాలెంలోని 3 లే ఔట్లలో 9వేల ఇళ్ల స్థలాలకు మార్కింగ్, హద్దురాళ్లు పాతే పనులను ప్రారంభించారు. ఇళ్ల స్థలాల్లోని ముళ్ల కంపను తగులబెట్టారు. పిచ్చి మొక్కలు తొలగించారు. 7 రోజుల్లో ఇళ్ల స్థలాల పనుల మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఈనెల 15లోపు లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.