SC FIRES ON IAS OFFICER SRIALXMI : జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా దాల్మియా సిమెంట్‌కు సున్నపురాయి గనుల కేటాయింపు వ్యవహారంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి విచారణను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన మూడేళ్ల తర్వాత దానిని సవాలు చేస్తూ పిటిషన్ వేయడం ఏమిటంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సున్నపురాయి గనుల కేటాయింపులో శ్రీలక్ష్మిపై కొన్ని సెక్షన్ల కింద దాఖలైన కేసులను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను, మరికొన్ని సెక్షన్ల కింద విచారణను ఎదుర్కోవాలని హైకోర్టు 2017లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి.. సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేశారు.
జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్లను సోమవారం విచారించింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసులో శ్రీలక్ష్మిని విచారించేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 13 ఛార్జిషీట్లు ఉన్నాయని.. ఐపీసీలోని ఇతర సెక్షన్ల కింద విచారణకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్నారు. ఇతర నిందితులతో కుమ్మక్కై శ్రీలక్ష్మి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. నిబంధనలు అంగీకరించవని తెలిసినా ఉద్దేశపూర్వకంగానే 407 హెక్టార్లలోని సున్నపురాయి గనులపై జయా మినరల్స్‌కు లైసెన్సులు ఇవ్వాలని సంబంధిత మంత్రికి దస్త్రాన్ని పంపారని తెలిపారు.