శారీరక ధృడత్వానికి, మానసిక వికాసానికి ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే మన విద్యా విధానంలోనూ ఆటల్ని భాగం చేశారు. యువతలోని ప్రతిభను వెలికి తీసేందుకు.. వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తుంటారు. దీనికి సంబంధించి.. మౌళిక వసతులు, శిక్షణ బాధ్యతలను ప్రభుత్వం చూస్తుంది. క్రీడా ప్రాధికార సంస్థ-శాప్ ద్వారా ఈ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తుంటారు. అయితే.. ఇకపై ఆటలు ఆడాలంటే పైకం చెల్లించాల్సిన పరిస్థితులు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన విధానమే దీనికి కారణం. రాష్ట్రంలో శాప్ ఆధ్వర్యంలోని క్రీడా ప్రాంగణాలను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించారు.
గుంటూరు జిల్లాలో మొదటి విడతలో.. తెనాలి, బాపట్ల, మాచర్లలోని క్రీడా ప్రాంగణాలను ప్రైవేటు వారికి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసి టెండర్లకు పిలిచారు. ఈనెల 7వ తేదిన టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. తెనాలి స్టేడియానికి నెలకు లక్షా 50 వేల రూపాయలు, మాచర్ల, బాపట్ల క్రీడాప్రాంగణాలు నెలకు 75 వేల రూపాయలు చెల్లించి తీసుకోవచ్చని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. క్రీడా సంఘాల ప్రతినిధులు.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పేద, మధ్యతరగతి క్రీడాకారులకు ఇది భారంగా మారుతుందంటున్నారు.