ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైసీపీ ఎంపీలు.. సిట్టింగ్​ ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు.. అసెంబ్లీ ఎన్నికకు సిద్ధమవుతున్న ఎంపీలు

YSRCP MPs: అధికార వైసీపీలో కొంతమంది ఎంపీలు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలిచేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరిని పార్టీ అధిష్ఠానమే అసెంబ్లీ బరిలోకి దించాలనుకుంటోంది. దీంతో సిటింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య వర్గపోరు రాజుకుంది.

YSRCP MPs
వైఎస్సార్సీపీ

By

Published : Apr 9, 2023, 7:36 AM IST

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న ఎంపీలు!

YSRCP MPs: వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలిచేందుకు కొందరు వైసీపీ ఎంపీలు మొగ్గుచూపుతున్నారు. కొందరు ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలను ఎంచుకుంటున్నారు. మరికొందరు నేరుగా చెప్పలేక.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొందరు ఎంపీలనైతే పార్టీ అధిష్ఠానమే అసెంబ్లీ బరిలోకి దించాలనుకుంటోంది. దీంతో సిటింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య వర్గపోరు రాజుకుంది. వైసీపీకి 22 మంది లోక్‌సభ సభ్యులు ఉండగా.. వారిలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీకి దూరంగా ఉంటున్నారు. మిగిలిన 21 మందిలో దాదాపు సగం మంది వరకూ అసెంబ్లీ వైపే చూస్తున్నారు.

కాకినాడ ఎంపీ వంగా గీత పిఠాపురంలో పోటీకి సిద్ధమవుతున్నారు. తన కోటా ఎంపీ లాడ్స్‌ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని పిఠాపురానికి మళ్లిస్తున్నారు. రైల్వేగేట్ల వద్ద ఆర్వోబీలకు అనుమతులు తీసుకొచ్చే ప్రయత్నాలనూ గీత చేస్తున్నారు. పిఠాపురం పరిధిలోని శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకూ హాజరవుతున్నారు. గతంలో పిఠాపురం నుంచే ఎమ్మెల్యేగా పనిచేసినందు వలన నియోజకవర్గంలో ఆమె వర్గం బలంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు, ఎంపీకి మధ్య కొంత గ్యాప్ వచ్చిందన్న ప్రచారం ఉంది.

అరకు ఎంపీ మాధవి వచ్చే ఎన్నికల్లో పాడేరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పాడేరు క్యాంపు కార్యాలయంలో తన ప్రతినిధిగా ఉండే ఏపీ ట్రైకార్‌ ఛైర్మన్‌ బుల్లిబాబును ఆమె పంపేసి, వారానికి రెండు రోజులు.. ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మాధవి తండ్రి గతంలో ఎమ్మెల్యేగా చేశారు. ఆమె కూడా 2019లో ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనుకున్నా, అధిష్ఠానం మాత్రం ఎంపీగా పంపింది. పాడేరు స్థానంలో సిట్టింగ్​ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో పాటు.. ఏపీ ట్రైకార్‌ ఛైర్మన్‌ టికెట్‌ ఆశిస్తుండటంతో ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి పోటాపోటీగా కనిపిస్తోంది.

రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌కు నగర అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను వైసీపి అధినాయకత్వం అప్పగించింది. నగరంపై ఆధిపత్యం కోసమే ఎంపీకి అదే విధంగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకి మధ్య పోరు సాగింది. పరస్పరం విమర్శలు చేసుకోవడంతో ఇద్దరినీ అధిష్ఠానం పిలిపించి మాట్లాడే వరకూ పరిస్థితి వెళ్లింది. భరత్, రాజా మధ్య పోరు ప్రస్తుతానికి బహిరంగంగా లేకపోయినా, అంతర్గతంగా మాత్రం ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు.

అమలాపురం ఎంపీ చింతా అనురాధ కొంతకాలం నుంచి రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఇక్కడ పలు కార్యక్రమాలకు హాజరైన.. ఇప్పుడు కొంత తగ్గించారు. రాజోలు, పి.గన్నవరం, అమలాపురం మూడింట్లో ఏదో ఒకచోట తనకు లేదా తమ కుటుంబసభ్యుల్లో ఒకరికి అవకాశం ఇస్తే పోటీకి సిద్ధంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ సారి విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసే యోచనలో ఉన్నారన్న ప్రచారం ఉంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ అధినాయకత్వం సరైన అభ్యర్థి కోసం ప్రయోగాలు చేస్తోంది. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలోకి దిగే ఆలోచనల్లో ఉన్నారన్న ప్రచారం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడా పోటీచేయరనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

కొందరు ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దించేందుకు వైసీపీ అధిష్ఠానం సన్నద్ధమవుతోంది. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను ఉరవకొండకు పంపితే ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికే సర్వేలు చేయించారు. ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉరవకొండలో ఎక్కువ శాతం ఉండటంతో ఈ ప్రయత్నాలు చేస్తోందంటున్నారు. ప్రస్తుతం ఉరవకొండ వైసీపీ ఇంచార్జ్​ విశ్వేశ్వర రెడ్డికి వర్గపోరు ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై పార్టీ అధినాయకత్వం దృష్టి సారిస్తోందంటున్నారు. ఎంపీ రంగయ్య కళ్యాణదుర్గంపై దృష్టి సారించారు. అక్కడ మంత్రి ఉష శ్రీచరణ్‌తో పోటీగా వర్గాన్ని పెంపొందించుకున్నారు. ఎంపీగా వెళ్లేందుకే ఇష్టపడుతున్నట్లు రంగయ్య చెబుతుండడం కొసమెరుపు.

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ కర్నూలు జిల్లాలో అసెంబ్లీ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినాయకత్వం ఆయన్ను పత్తికొండ నుంచి బరిలోకి దింపితే ఎలా ఉంటుందని కసరత్తు చేసినా, తర్వాత కాస్త నెమ్మదించినట్లు చెబుతున్నారు.

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అసెంబ్లీకే పోటీచేయాలని 2019లో ప్రయత్నించారు. అప్పట్లో ఆయన ఎంపీగా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని సస్పెండ్‌ చేసిన వైసీపీ అధినాయకత్వం.. నెల్లూరు గ్రామీణ స్థానాన్ని ఎంపీ ఆదాలకు అప్పగించింది. తిరుపతి ఎంపీ డాక్టర్‌ గురుమూర్తిని వచ్చే ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి పంపేందుకు వైసీపీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ను సంతనూతలపాడు నుంచి పోటీ చేపించే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది.


ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

YSRCP MP

ABOUT THE AUTHOR

...view details