1946లో బ్రిటీష్ పాలన నుంచి దేశం విముక్తి పొందుతున్న క్రమంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి రక్షణ కల్పించడానికి కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. శాంతిభద్రతలను అదుపు చేయడంతోపాటు అల్లర్లను అరికట్టడంలో ప్రజలకు సాయంగా ఉండాలనే ఉద్దేశంలో వివిధ రంగాల్లోని వారు సమూహంగా ఏర్పడి సేవలందించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ బృందాల సేవలను ప్రభుత్వం గుర్తించింది. చైనా యుద్ధం తర్వాత హోంగార్డులుగా గుర్తించి వారితో సేవ చేయించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలా 1963లో హోంగార్డ్సు వ్యవస్థ ఆవిర్భవించింది.
గుంటూరు అర్బన్ పరిధిలో 390, రూరల్ పరిధిలో 980 మంది విధులు హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. చోరీ కేసుల్లో నిందితులను పట్టుకోవడం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, శాంతిభద్రతల పరిరక్షణ, నేర రికార్డుల బ్యూరో, వేలిముద్రల విభాగం, విజిలెన్స్, కమ్యూనికేషన్, ఆక్టోపస్, కంప్యూటర్ ఆపరేటర్, సీబీసీఐడీ, మెరైన్, గ్రేహౌండ్స్, పోలీసు బ్యాండ్, పోలీసు శిక్షణ కేంద్రం, పోలీసు వాహన డ్రైవర్లు, వారెంట్లు జారీ, వీవీఐపీల బందోబస్తులు ఇలా అనేక విభాగాల్లో పోలీసులకు దీటుగా సేవలందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇతర విభాగాల్లోనూ విధులు నిర్వహిస్తున్నారు.
వేతనాలు ఇంతే...
హోంగార్డ్సుకు గతంలో రోజుకు రూ. 600 గౌరవ వేతనంగా అందించేవారు. ఆ మొత్తాన్ని రూ.700లకు పెంచారు. అలా నెలకు రూ.21 వేల వరకు వేతన రూపంలో అందిస్తున్నారు. అయితే పనిచేసిన రోజుకే వేతనం అందిస్తున్నారు. హోంగార్డ్సుగా సేవచేస్తున్న వారికి ప్రభుత్వం పోలీసు కానిస్టేబుళ్ల ఎంపికలో ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది. పోలీసు నియామకంలో గరిష్టంగా 30 ఏళ్ల వరకు వయస్సు సడలింపు ఇస్తుంది. హోంగార్డ్సు ఫండ్ నుంచి చనిపోయిన హోంగార్డ్సుకు మట్టి ఖర్చుల కింద రూ. 5 వేలు అందిస్తోంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న హోంగార్డ్సుకు వారి సంక్షేమ నిధి నుంచి రూ.4,999లు వరకు మంజూరు చేస్తుంది. కేంద్ర సంక్షేమ నిధుల నుంచి హోంగార్డ్సు కుమార్తె పెళ్లికి రూ.5 వేలు అందిస్తుంది. వారి విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌గా రూ. 2 వేలు ఇస్తుంది. చనిపోయిన హోంగార్డ్సుకు ఆర్థికసాయంగా రూ. 15 వేలు వరకు మంజూరు చేస్తున్నారు. చనిపోయిన హోంగార్డులకు ప్రధానమంత్రి బీమా పథకం కింద రూ.2 లక్షలు వరకు అందజేస్తారు.
ఉద్యోగ భద్రత, పదోన్నతుల కోసం పోరాటం