Sarpanches Dharna across the state: పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 14, 15 ఆర్థిక సంఘ నిధులను సీఎఫ్‌ఎంఎస్ ఖాతాల నుంచి దారి మళ్లించడంపై రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లు భగ్గుమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసనలతో హోరెత్తించారు. రాష్ట్రంలోని 12 వేల 900 వందల గ్రామాలకు రావాల్సిన 8 వేల 660 కోట్ల రూపాయలను పంచాయతీలు, సర్పంచ్‌ల అనుమతి లేకుండా మళ్లించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వాడుకున్న నిధులను తిరిగి తమ ఖాతాల్లో జమ చేయాలని సర్పంచులు.. కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లగా.. కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.. ఆర్ధిక సంఘం నిధులను దారి మళ్లించడమే కాకుండా పంచాయతీల అభివృద్ధిని అటకెక్కించిన ఘనత.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతోందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్పంచ్‌లు ఆరోపించారు. నిధులు, విధులు లేకుండా పంచాయతీలను డమ్మీలుగా మార్చడాన్ని నిరసిస్తూ.. ఏలూరులో ర్యాలీ నిర్వహించారు. కేంద్రం విడుదల చేసిన 8వేల 660 కోట్లను వెంటనే పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని జిల్లా స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.
కర్నూలు..ప్రభుత్వం వాడుకున్న నిధులను తిరిగి ఇప్పించాలని కోరుతూ.. కర్నూలు, కలెక్టరేట్ వద్ద సర్పంచ్‌లు ఆందోళన చేశారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను సర్పంచ్‌ల పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌ను కలిసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు సర్పంచ్‌లు యత్నించారు. ఈ క్రమంలో కలెక్టరేట్ వద్ద కొంత ఉద్రిక‌్తత పరిస్థితి నెలకొంది.
నెల్లూరు జిల్లా.. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని.. సర్పంచ్‌లు కేవలం ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతున్నారని నెల్లూరు కలెక్టరేట్ వద్ద సర్పంచ్‌లు ధర్నా నిర్వహించారు. నగరాలోని ప్రముఖ కూడళ్ల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. సర్పంచ్‌ల సమస్యల్ని పరిష్కరించాలని 15 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు.