Meeting of Sarpanches to Solve Their Problems: ఆంధ్రప్రదేశ్ సర్పంచ్‌ల సంఘం.. ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ‘సర్పంచులు-గ్రామాల్లో సమస్యలు’అనే అంశంపై.. విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. వైసీపీ మినహా.. అన్ని రాజకీయ పార్టీల నేతలు, సర్పంచ్‌లు హాజరయ్యారు. గ్రామాల్లో దోమల మందు కూడా స్ప్రే చేయించే పరిస్థితుల్లో పంచాయతీలు లేవని.. వైసీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్‌లు అనేక రూపాల్లో నిరసనలు తెలిపినా.. రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన ఆర్థిక సంఘం నిధులు తిరిగి పంచాయతీలకు కేటాయించలేదని వాపోయారు.
సమస్య పరిష్కారం కోసం సర్పంచులు.. దిల్లీ వేదికగా పోరాటాలకు సిద్ధం కావాలని, ఇందుకు సహకరిస్తామని.. రాజకీయ పార్టీల నేతలుప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో సమస్యల పరిష్కారం.. ఛలో దిల్లీ కార్యక్రమానికి సర్పంచులంతా సిద్ధం కావాలని.. పంచాయత్ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు.
"ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా.. మాకు కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా దారి మళ్లించారు. ఇదేమిటని ప్రశ్నించగా.. విద్యుత్ బకాయిల కింద జమ చేసుకున్నాం అని అంటున్నారు". - వానపల్లి లక్ష్మి
"నేను వైఎస్సార్సీపీ మద్దతుతోనే గెలిచాను. 80 శాతం మంది వైసీపీ సర్పంచులే ఉన్నారు. వాళ్లందరూ కూడా గ్రామాలను అభివృద్ధి చేయలేక.. విధులు సక్రమంగా చేయలేక పోతున్నాం. ఓటు వేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక పోతున్నాం". - సావిత్రి, వైసీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్