ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sarpanches Protests: "మే 7లోగా 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విడుదల చేయాలి.. లేకుంటే.!"

Sarpanches Protests: తమ సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్​లు శాంతియుత పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 29, 30 తేదిల్లో వైసీపీ ప్రజా ప్రతినిధులను కలిసి వినతి పత్రాలను ఇవ్వాలని ఏపీ సర్పంచ్​ల సంక్షేమ సంఘం నేతలు నిర్ణయించారు.

Sarpanches Protests
Sarpanches Protests

By

Published : Apr 28, 2023, 11:01 AM IST

మే 2 నుంచి 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసనలు

Sarpanch Protests: వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో సర్పంచ్​ల పరిస్థితి దారుణంగా తయారైందని పలువురు సర్పంచ్​లు అందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు, విధులు లేకుండా తాము సర్పంచ్​లుగా ఎందుకు ఉన్నామో ఆర్ధం కావడం లేదని వాపోతున్నారు. సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చి సర్పంచ్​లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఆవేదన చెందుతున్నారు. ప్రజల చేత ఎన్నుకొబడిన తాము.. నేడు ప్రజలకు ఏం చేయలేకుండా ఉన్నామని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తమ సమస్యల పరిష్కారానికై శాంతియుత పోరాటానికి సిద్దమవుతున్నట్లు తెలిపారు. ఈ నెల 29,30 తేదిల్లో వైసీపీ ప్రజా ప్రతినిధులను కలిసి వినతిపత్రాలను ఇవ్వాలని ఏపీ సర్పంచ్​ల సంక్షేమ సంఘం నిర్ణయించింది. మే 1 వ తేదీన సర్పంచ్‌ల సమస్యలపై స్పందనలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 2 నుంచి 7వ తేదీ వరకు వినతిపత్రాలు ఇవ్వడంతో పాటు శాంతియుతంగా నిరసనలు తెలియచేస్తామన్నారు. 7వ తేది లోపు 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విడుదల చేయని పక్షంలో.. 8వ తేది నుంచి అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు.

ప్రభుత్వం పంచాయతీల నిధులను తీసుకోవడం వల్ల తాము గ్రామాల్లో చిన్న పని చేయాలన్న ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. గ్రామాన్ని అభివృద్ది చేస్తామని నమ్మి ప్రజలు తమను గెలిపిస్తే నేడు ప్రజలకు ఏం చేయలేని స్థితిలో ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలోని ఉన్న పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నుంచి దాదాపు 2 వేల 10 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ఏపీ సర్పంచ్​ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిలకలపూడి పాపారావు చెప్పారు.

కేంద్రం వద్దకు వెళ్లి పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని సర్పంచ్​లు ఎప్పుడు అడిగినా దాఖలు లేవని.. కానీ తాము రెండు సార్లు దిల్లీ వెళ్లి కేంద్రాన్ని అభ్యర్థించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5వ ఆర్థిక సంఘం నిధులు జమ చేస్తేనే తాము 15వ ఆర్థిక సంఘం నిధులు వేస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తాము నలిగిపోతున్నామని పేర్కొన్నారు.

అంతే కాకుండా ప్రభుత్వం సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి సర్పంచ్​లను డమ్మీలుగా మార్చిందని మండిపడుతున్నారు. ఇప్పుడు ఏ పని కావాలన్న సచివాలయంలోనే చేస్తున్నారని, ఇంకా సర్పంచ్​తో ప్రజలకు అవసరం లేకుండా చేశారని అన్నారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను సర్పంచ్ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. మైనర్ పంచాయతీలకు విద్యుత్ బిల్లులు సమస్యగా మారాయని చెప్పారు. వైఎస్ చెల్లించిన విధంగా మైనర్ పంచాయతీ విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని సూచించారు.

తాము ప్రభుత్వంతో కలిసే ఉంటామని ఏపీ సర్పంచ్​ల సంక్షేమ సంఘం మహిళా నేత శ్రీదేవి, అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూదిల్లీ జాతీయ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు తెలిపారు. తమ ఆవేదనను ప్రభుత్వానికి చెబుతున్నామని అన్నారు. పంచాయతీలకు రావాల్సిన నిధులను ప్రభుత్వం తీసుకోవడం వల్ల తాము ప్రజల ముందు దోషులుగా నిలబడ్డామని చెప్పారు. అనేక రకాలుగా తాము నిరసన తెలుపుతున్న ప్రభుత్వంలో మాత్రం చలనం రావడం లేదని వాపోతున్నారు.

గ్రామాల్లో అభివృద్ది పనులు చేయలేక సర్పంచ్​లు అనేక అవస్థలు పడుతున్నారని, అప్పులు చేసి గ్రామంలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. తప్పని పరిస్థితుల్లోనే తాము రోడ్డెక్కాల్సి వస్తుందని తెలిపారు. 29,30 తేదీల్లో సర్పంచ్​లు పడుతున్న అవస్థలపై వైసీపీ ప్రజా ప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ స్పందన చూసిన తర్వాత మాత్రమే తాము నిరసన తెలియచేస్తామన్నారు. ప్రభుత్వం స్పందించి సర్పంచ్ లను రోడ్డెక్కకుండా చూడాలని కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details