ప్రభుత్వం ఎన్ని రకాలుగా అడ్డుకున్నా.. సంగం డెయిరీకి రైతులు, వినియోగదారులు అండగా నిలబడతారని సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీలో నూతన ఉత్పత్తులను ఆయన విడుదల చేశారు. సంగం కోల్డ్ కాఫీ, పాలపొడి, 400 గ్రాముల పెరుగు ప్యాకెట్లను మార్కెట్లోకి విడుదల చేశారు. రెడీ ఇట్ ప్రొడక్ట్స్ అయినా చపాతి, పరోటా, సమోసాలను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ధూళిపాళ్ల చెప్పారు. ఇప్పటికే 136 రకాలు.. డెయిరీలో తయారీ అవుతున్నాయని పేర్కొన్నారు.
సంగం డెయిరీకి పాల ఉత్పత్తిదారులే బలం. పాడి రైతుల సహకారంతో డెయిరీని మరింత ముందుకు తీసుకెళ్తాం. ప్రస్తుతం డెయిరీ నుంచి 133 ఉత్పత్తులు ఉన్నాయి. తాజాగా మరో మూడు ఉత్పత్తులు విడుదల చేశాం. భవిష్యత్తులో మరిన్ని నూతన ఉత్పత్తులు తయారుచేస్తాం. కరోనా తర్వాత రెడీ టూ ఈట్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తులు తయారుచేస్తున్నాం. - ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఛైర్మన్