Samagra Shiksha Abhiyan Employees Protest in AP :వేతన పెంపు సహా సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్న ఉద్యోగులు సమస్యలు పరిష్కరించేవరకు నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంట్రక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతూ సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఉద్యోగులు అన్నమయ్య కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేశారు. చెవులలో పూలు పెట్టుకుని వినూత్నంగా నిరవధిక సమ్మెలో పాల్కోన్నారు.
జగన్ ఇచ్చిన హామీలు నేరవేర్చాలి - గళమెత్తిన సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులు
ఉద్యోగుల నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి దీక్షా శిబిరాన్ని వద్దకు వెళ్లి మద్దతు తెలియజేశారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగులను మోసం చేశారని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. చిరు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో గత నాలుగు ఏళ్లుగా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం మొండివైఖరి విడనాడలని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే చిరు ఉద్యోగుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
Contract and Outsourcing Employees Protest : తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విజయనగరం కలెక్టరేట్ ఇన్ గేటు నుంచి ఔట్ గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో తమకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తము మూడు రోజుల నుంచి రోడ్లపై చేరి సమ్మె చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని, అలాగే ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా కేవలం జీతం మీద మాత్రమే ఆధారపడి పనిచేస్తున్నామని వాపోయారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగంలోనే పనిచేస్త ఇక్కడే ఉండిపోయామని తెలిపారు. తమకు ఎదుగుదల లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గళమెత్తిన సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులు - ఇచ్చిన హామీలు నేరవేర్చాలంటూ డిమాండ్
విజయవాడ ధర్నా చౌక్ ఎదుట సమగ్రశిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మె మూడో రోజు కొనసాగుతుంది. కనీస వేతనాలు మంజూరు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సమగ్రశిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కనీస వేతనాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారని మండిపడ్డారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులు క్రమబద్ధీకరించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తమ ఆందోళన కొనసాగుతందని తేల్చి చెప్పారు.
ఆందోళన బాటలోనే సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు - పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్