ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకృతి ప్రేమికుడు... ఇంటినే వనంలా మార్చాడు..!

ప్రకృతి గురించి బోధించాడు. పదవీ విరమణ అనంతరం పచ్చని వాతావరణంలో సేదతీరాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మిద్దె సాగుపై దృష్టి సారించాడు. తన భవనాన్నే నందనవనంలా మార్చాడు. రంగురంగుల పూలు... అవసరమైన కూరగాయలు పండిస్తున్నాడు. అటు ఆరోగ్యం... ఇటు కాలక్షేపం రెండూ కలిసొస్తున్నాయని చెబుతున్నాడు... గుంటూరు జిల్లాకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు శేషగిరిరావు.

ప్రకృతి ప్రేమికుడు... ఇంటినే నందన వనంలా మార్చాడు

By

Published : Nov 17, 2019, 8:58 PM IST

ప్రకృతి ప్రేమికుడు... ఇంటినే నందన వనంలా మార్చాడు

అరవిరిసిన మందారాలు... జాజిపూల సోయగాలు... బంతిపూల సొగసులు... నందివర్ధనాల నగువులు... ఇలా ప్రకృతిమాత ఒడినుంచి జాలువారిన కుసుమాలన్నీ... గుంటూరు జిల్లా అమృతలూరుకు చెందిన శేషగిరిరావు ఇంటిలో కొలువుదీరాయి.

మొక్కలు పలకరిస్తాయి...
ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి పదవి విరమణ పొందిన శేషగిరి రావు... తన ఇంటిని వివిధ రకాల మొక్కలతో పొదరిల్లులా మార్చేశారు. ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి... ప్రతిచోటా ఏదోఒక మొక్క మనల్ని పలకరిస్తుంది. మెట్ల పైకి వెళ్లే సమయంలోనూ... అవి తోడుగా ఉంటాయి. ఇక మిద్దెపైకి వెళ్లామంటే చాలు... రకరకాల పూలు, కూరగాయల మొక్కలు కనిపిస్తాయి.

మిద్దెసాగుతో...
మిద్దెసాగు పేరిట ఇటీవల వచ్చిన నూతన ఒరవడిని అందిపుచ్చుకున్న శేషగిరిరావు దంపతులు... ఇలా భిన్నమైన పూలు, కూరగాయల్ని పండిస్తున్నారు. టమోటా, బెండ, దొండ, కాకర, బీర తదితర కూరగాయలతో పాటు... జామ, బొప్పాయి, దానిమ్మ వంటి పండ్ల మొక్కలు, గులాబీ, మందారం, నందివర్ధనం, గరుడ వర్ధనం, మందారం, మంకెన, బంతి, చామంతి వంటి పూల మొక్కులను శేషగిరిరావు ఇంటిపై చూడవచ్చు.

అప్పుడు చెప్పా...ఇప్పుడు ఆచరిస్తున్నా...
శేషగిరిరావు ఇంట్లో పూజకు అవసరమైన పూలు... వీటి నుంచే సేకరిస్తారు. వంటలకు అవసరమైన కూరగాయల్ని ఇక్కడే పండిస్తున్నారు. ఎక్కువగా పండినప్పుడు ఇరుగుపొరుగు వారికి అందిస్తున్నారు. ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు... మొక్కలు గురించి పిల్లలకు చెప్పానని... ఇప్పుడు ఇంట్లో చేసి చూపిస్తున్నానని అంటారు శేషగిరిరావు. తులసి, అల్లోవీరా వంటి ఔషధ మొక్కలు ఉండటం కారణంగా... ఆరోగ్యం బాగుంటుందని ఆయన చెబుతున్నారు.

కాలక్షేపమూ...ఆరోగ్యమూ...
భవనంపైన షేడ్​నెట్ ఏర్పాటు చేయటం ద్వారా... ఎండ వేడిమిని 50శాతం మేర తగ్గించారు. తద్వారా అవసరమైన ఉష్ణోగ్రతలో మొక్కలు పెరుగుతున్నాయి. మిద్దెసాగు చేపట్టే క్రమంలో... తమ ఇంట్లో పాడైపోయిన వస్తువులెన్నో కుండీలుగా మారిపోయాయి. ఇంట్లో పోగయ్యే చెత్తా చెదారానికి, కొబ్బరిపీచు తోడు చేసి ఎరువుగా మార్చి మొక్కలకు వేస్తున్నారు. మొక్కల పెంపకం వల్ల... కాలక్షేపంతోపాటు ఆరోగ్యంగా ఉంటున్నామని అంటున్నారు శేషగిరిరావు భార్య విజయలక్ష్మి.

శేషగిరిరావు దంపతులు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినా... సాయంత్రానికల్లా తిరిగివస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉండాల్సి వస్తే... మొక్కల ఆలనా పాలనా చూసేందుకు పనిమనిషిని పెట్టి వెళ్తారు. మొక్కల పట్ల తమ ప్రేమను చాటుకుంటున్నారు... ఈ ప్రకృతి ప్రేమికులు

ఇవీ చూడండి-8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..!

ABOUT THE AUTHOR

...view details