జాతీయ రహదారిపై ప్రమాదం.. ఎమ్మెల్యే మానవత్వం - పెదకాకానిలో ప్రమాదం
పెదకాకానిలో బైకును కారు ఢీకొన్న ఘటనలో.. ఓ వ్యక్తి చనిపోగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి వెంటనే స్పందించారు. బాధితుడికి ప్రథమ చికిత్స చేసి.. ఆసుపత్రికి పంపించారు.
గుంటూరు జిల్లా పెదకాకాని పరిధిలోని జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరిని... వెనుకవైపు నుంచి కారు ఢీకొన్న ఘటనలో గుంటూరుకు చెందిన చందు మృతి చెందారు. మస్తాన్ వలి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న తాడికొండ శాసనసభ్యురాలు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి.. తన వాహనాన్ని ఆపి క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స చేశారు. దగ్గరుండి అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ రాగానే తీవ్రంగా గాయపడిన వ్యక్తికి సిలైన్ ఎక్కించారు. క్షతగాత్రుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.