Revenue Deficit In AP : ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ లోటు భయపెడుతోంది. ప్రతిసారీ రెవెన్యూ లోటును నియంత్రిస్తామని అధికారులు, మంత్రులు చెబుతున్నా అది సాధ్యం కాకపోగా.. అంచనాలు మించిపోతోంది. గడిచిన ఐదు సంవత్సరాలలో ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతూనే ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో మరో సరళి ప్రబలిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వరంగ కార్పొరేషన్ల నుంచి అప్పులు తెచ్చి మరీ కొన్ని కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. వాటిని తీర్చేందుకు రాష్ట్ర ఆదాయాన్ని మళ్లిస్తున్నారు.
రాష్ట్ర బడ్జెట్‌లోనే కార్పొరేషన్లకు గ్రాంట్లు మంజూరు చేసి, రుణాలు తీర్చాల్సిన పరిస్థితి వస్తోంది. ఆ అప్పులతో రెవెన్యూ ఖర్చులు చేస్తున్నా.. వాటిని లెక్కల్లోకి చేర్చట్లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా రెవెన్యూ లోటును, ద్రవ్యలోటును ఉన్న దాని కంటే తక్కువగా చూపిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
రెవెన్యూ రాబడి కన్నా.. ఖర్చులు ఎక్కువైతే దానిని రెవెన్యూ లోటు అంటారు. దీనిని ఎప్పటికప్పుడు పరిమితం చేసుకుంటే.. అదే అసలైన ఆర్థిక నిర్వహణ. రాష్ట్రంలో సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలిపితే రెవెన్యూ రాబడి అంటారు. సొంత పన్నుల్లో జీఎస్టీ వసూళ్లు, రిజిస్ట్రేషన్ల ఆదాయం, స్టాంపులు, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, కేంద్రపన్నుల్లో వాటాలు, రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీలు, ఇతర పన్నులు-సుంకాల ద్వారా వచ్చే మొత్తం ఉంటాయి.