గుంటూరులో కస్టమర్లను తమవైపు తిప్పుకునేందుకు రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల యజమానులు కొత్త విధానాలను అవలంబిస్తున్నారు. రెస్టారెంట్ ముందు భాగాన్ని అందరూ ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు.భవనం గోడల్లోకి వాహనాలు బయటకు వచ్చినట్లుగా డిజైన్ చేస్తున్నారు.
జేకేసీ కాలేజి సమీపంలోని ఓ ఫుడ్ కోర్టు యజమాని కారు భవనానికి వేలాడుతున్నట్లుగా అమర్చారు. అటుగా వెళ్లేవారు ఎవరైనా చూస్తే కారు ఒకటో అంతస్థులో నుంచి బయటకు వచ్చిందా అన్నట్లుగా కనిపిస్తోంది. ఇక బృందావన్ గార్డెన్స్ లో ఓ కాపీ షాప్ యజమాని సైతం ఇదే తరహాలో తన కేఫ్ ను తీర్చిదిద్దారు. కాకపోతే ఇక్కడ ఓ స్కూటర్ తన షాప్ నుంచి బయటకు వెళ్తున్నట్లు డిజైన్ చేశారు. వాస్తవంగా అక్కడ కారుని... ఇక్కడ స్కూటర్ సగానికి కట్ చేసి... ముందు భాగాన్ని మాత్రమే జాగ్రత్తగా గోడలకు బిగించారు. అయితే చూసేందుకు మాత్రం గోడలో నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది. సాధారణంగా ఏవైనా ఆఫర్లతో వినియోగదారుల్ని ఆకర్షించటం మామూలే కాని... ఇలా తమ భవనం వెలుపలి భాగాన్ని వినూత్నంగా తీర్చిదిద్ది ఆకట్టుకోవటమే ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకోవాలి.