Remand to Four Employees: ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే ఆరోపణలపై.. ఎస్‌టీ అధికారులు మెహర్‌కుమార్, కె.సంధ్య, సీనియర్ అసిస్టెంట్ కేవీ చలపతి, ఆఫీసు సబార్డినేట్ ఎం.సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ కేఆర్ సూర్యనారాయణ, ఇతరులను నిందితులుగా పేర్కొన్నారు. బుధవారం సూర్యనారాయణ మినహా మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గురువారం విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి రాజశేఖర్ ముందు రిమాండ్ నిమిత్తం హాజరుపరిచారు.
నిందితుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర.. ఉద్దేశపూర్వకంగా పోలీసులు ఐపీసీ 409 సెక్షన్ నమోదు చేశారన్నారు. పన్ను వసూలు చేసే బాధ్యతను నిందితులకు అప్పగించలేదన్న ఆయన.. అలాంటప్పుడు 409 సెక్షన్ కింద కేసు నమోదు చెల్లదని తెలిపారు. ఇదే ఆరోపణలతో నిందితులపై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకోవడాన్ని హైకోర్టు రద్దు చేసిందన్నారు.
సుప్రీంకోర్టు అర్నేష్‌కుమార్ కేసులో ఇచ్చిన మారదర్శకాలను దాటవేయాలన్న దురుద్దేశంతో పోలీసులు ఏడేళ్లకు పైబడే శిక్షకు వీలున్న సెక్షన్లు నమోదు చేస్తున్నారన్నారు. 409 సెక్షన్ మినహా మిగిలిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవే కాబట్టి సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నిందితులకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలన్నారు. రిమాండ్‌ను తిరస్కరించాలని అభ్యర్థించారు.
పోలీసుల తరఫున వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.నాగిరెడ్డి.. రిమాండ్ దశలో సెక్షన్ 409 వర్తిస్తుందా? లేదా? అనే విషయంలో లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. నిందితులందరూ పబ్లిక్ సర్వెంట్లుగా పేర్కొన్న న్యాయవాది.. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తీసుకున్న అంతర్గత నిర్ణయాల ప్రకారం నిందితులకు పన్ను వసూలు చేసే బాధ్యత అప్పగించారన్నారు.