No Cut off Marks in SI Written tests in Telangana: ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియలో తుది రాత పరీక్షలు మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు జరగనున్నాయి. ప్రాథమిక రాతపరీక్షలో లాగా అర్హత మార్కులను తగ్గించే అవకాశాలున్నాయా..? అనే సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి. గతంలో జనరల్ అభ్యర్థులకు 80 మార్కులు, బీసీలకు 70, ఎస్సీ, ఎస్టీలు, మాజీ సైనికోద్యోగులకు 60 మార్కులు అర్హతగా ఉండేవి. ప్రాథమిక రాతపరీక్ష అర్హత మార్కుల్ని అన్ని వర్గాల అభ్యర్థులకు 60 మార్కులుగానే నిర్ణయించారు.
ఈ నిర్ణయంపై ఆందోళనలు జరగడంతో.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కటాఫ్ మార్కుల్లో మార్పులు చేశారు. తుది రాతపరీక్షలోనూ కటాఫ్ మార్కులు తగ్గింపుపై ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అందుకు అవకాశం లేదని పోలీసు నియామక మండలి స్పష్టం చేసింది. జనరల్ అభ్యర్థులు 80 మార్కులు, బీసీ అభ్యర్థులు 70 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు, మాజీ సైనికోద్యోగులు 60 మార్కులు సాధిస్తేనే అర్హత సాధిస్తారని స్పష్టంచేసింది.