Rains In Ap: రాష్ట్రంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకూ చాలాచోట్ల కుండపోతగా వర్షం కురిసింది. గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరంతో పాటు పలు పట్టాణాల్లో రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు కొన్నిచోట్ల వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. శుక్రవారం కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. పలుప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో పట్టణాల్లో రహదారులు జలమయమయ్యాయి. అక్కడక్కడా వాగులు పొంగి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
గుంటూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, అమరావతి, పల్నాడు జిల్లా క్రోసూరు, అచ్చంపేట తదితర మండలాల్లో కల్వర్టులపై వర్షం నీరు ప్రవహించింది. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో పంట పొలాలు జలమయమయ్యాయి. శుక్రవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 10గంటల మధ్య అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో 102.75 మిల్లీమీటర్లు, పల్నాడు జిల్లా జూపూడిలో 88, ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 61.25 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.