Road accident in Guntur: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన కథనం మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడుకి చెందిన పాతుగంటి తాజ్(30) ఓ మెడికల్ కంపెనీలో రిప్రజెంటెటివ్గా పని చేస్తున్నాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన.. తన కంపెనీ మేనేజర్ విశ్వనాథం, వేణుగోపాల్ ఇద్దరూ కలిసి గుంటూరు నుంచి ద్విచక్ర వాహనంపై నరసరావుపేట బయలు దేరారు. ఫిరంగిపురం మండలం నుదురుపాడు సమీపంలో అకస్మాత్తుగా ఒక కోతి అడ్డు వచ్చింది. ఈ క్రమంలో బండి అదుపు తప్పింది. అదే సమయంలో నరసరావుపేట నుంచి మరో ద్విచక్ర వాహనం గుంటూరుకు వెళ్తూ తాజ్ ద్విచక్ర వాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది. ఈ ఘటనలో తాజ్ అక్కడిక్కడే మృతి చెందాడు. మిగతావారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని నరసరావుపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పశ్చిమ గోదావరిలో:తణుకు మండలం మండపాక గ్రామంలో కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. మనుషులపై దాడి చేస్తూ గాయాలు పాలు చేస్తున్నాయి. గాయపడిన వారు ఆసుపత్రి పాలు కాక తప్పడం లేదు. గ్రామంలో కొద్దిరోజులుగా కోతులు బెడద పెరిగింది. గడిచిన రెండు రోజుల్లో ఒక కోతి ఎనిమిది మందిని గాయపరిచింది. ఇలా కోతులు మనుషులపై దాడికి పాల్పడడం..గాయపరచడం పట్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండపాక గ్రామంలో నివాస ప్రాంతాలకు నాలుగువైపులా వ్యవసాయ భూములు ఉండటం వల్ల కోతులు ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు. వ్యవసాయ భూములు ఉన్నప్పటికీ కోతుల పోషణ కోసం అవసరమైన పంటలేవి లేకపోవడంతో నివాసిత ప్రాంతాలకు తరలివచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు చెబుతున్నారు. గ్రామంలో కోతి దాడికి గురైన బాధితుల్లో కొద్దిమంది తీవ్ర గాయాలతో తణుకులోని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.