Proposals to Amend Fire Department Act: తెలంగాణలో ఒక పక్క అగ్నిప్రమాదాల తీవ్రత, వాటి తాలూకు మరణాలు పెరిగిపోతున్నా ఉల్లంఘనలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఇందుకు ప్రధాన కారణం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు లేకపోవడమే. యజమానుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని, అమాయకులు మరణించారని నిరూపణ అయినప్పటికీ బాధ్యుల నుంచి జరిమానా మాత్రమే వసూలు చేస్తున్నారు. దాంతో ఉల్లంఘనలకు పాల్పడినా ఏమీ కాదులే అనే భరోసా ఏర్పడుతోంది.
సికింద్రాబాద్ దక్కన్‌మాల్ ప్రమాదం నేపథ్యంలో అగ్నిమాపక చట్టానికి పదును పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. తీవ్రతను బట్టి కఠిన శిక్షలు విధించేలా సవరణలను ప్రతిపాదించనున్నారు. వాణిజ్య సముదాయాలు, ఎత్తైన భవనాలు, బహుళ వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్ల వంటి వాటిని కచ్చితంగా అగ్నిమాపకశాఖ నిబంధనల ప్రకారమే నిర్మించాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించేలా అత్యవసర మెట్లు, భవనం లోపల అగ్నిప్రమాదాన్ని గుర్తించే సెన్సర్లు, వాటంతట అవే పని చేసే స్ప్రింక్లర్లు, భవనం చుట్టూ ఫైరింజన్ తిరగగలిగే సదుపాయం, ప్రమాదాన్ని ఆర్పడానికి అవసరమైన నీటి కోసం భూగర్భంలో, భవనంపై సంపులు, వీటి నుంచి నీటిని తోడేందుకు డీజిల్‌తో పని చేసే మోటార్ వంటివి కచ్చితంగా ఉండాలి. కానీ చాలా మంది ఈ నిబంధనలను పాటించడం లేదు. అనుమతులు తెచ్చుకునేందుకు మొదట్లో కొన్ని ఏర్పాట్లు చేస్తున్నా.. తర్వాత నిర్వహణ గురించి పట్టించుకోవడం లేదు. దాంతో ప్రమాదం జరిగినప్పుడు అవి పని చేయడం లేదు. చిన్నగా మొదలైన నిప్పు పెను ప్రమాదంగా మారడానికి ఇదే కారణం.