అందుబాటు ధరల్లో లభించే చికెన్, గుడ్లలోని పోషక విలువలు.. అన్ని వయసుల వారి ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తాయి. కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి చికెన్, గుడ్ల విక్రయాలపై ప్రభావం తీవ్రంగా పడింది. కొందరు సృష్టించిన అపోహలతో చికెన్ ధరలు బాగా పడిపోయాయి. ఈ సమయంలో చికెన్, గుడ్ల తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
దాణా లేక కోళ్లు చనిపోతున్నాయి..
గుంటూరు జిల్లాలో కోళ్ల పరిశ్రమ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వెలుగు చూసిన పరిస్థితుల్లో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. కోళ్లకు దాణా తీసుకెళ్లేందుకు అనుకూల వాతావరణం లేకపోవటంతో పాటు ఫారాల వద్దకు కూలీలు, యజమానులు వెళ్లే అవకాశం లేక కోళ్లు చనిపోతున్నాయని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశుసంవర్థక శాఖ అధికారులు పాసులు ఇచ్చినా.. పోలీసులు దాణాను అడ్డుకుని, వాహనాలు సీజ్ చేస్తున్నారు. దీనికి తోడు చికెన్ దుకాణాలు తెరవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారని... ఈ కారణంగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.