Police Searching for KR Suryanarayana: వాణిజ్యశాఖలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వ ఆదాయానికి ఉద్యోగులు గండికొట్టారనే కేసులో.. ప్రభుత్వం వేగం పెంచింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులను అరెస్ట్ చేసిన ప్రభుత్వం.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారయణను అరెస్ట్ చేసేందుకు.. ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపింది. ఆయన ఇంటికి ,అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లిన పోలీసులు.. సూర్యనారాయణ లేకపోవటంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఈ కేసును ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. పైనుంచి వస్తున్న ఆదేశాల ప్రకారమే విజయవాడ పోలీసులు నడుచుకుంటున్నారు. కేసు నమోదు, అరెస్ట్ వరకు ఏ దశలోనూ వివరాలు బయటకు రాకుండా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించే పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు సూర్యనారయణను మినహాయించి మిగిలిన నలుగురిని ముందుగా అరెస్ట్చేసినట్లు తెలుస్తోంది. వారి రిమాండ్ ప్రక్రియ పూర్తవ్వడంతో ఇప్పుడు సూర్యానారాయణ అరెస్ట్‌కు ఆదేశాలిచ్చారని సమాచారం.
అయితే పోలీసులు అరెస్ట్ చేసేందుకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకుని సూర్యనారాయణ శుక్రవారం ఉదయం నుంచే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఫోన్లు సైతం వదిలేసి గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన నలుగురు ఉద్యోగులను గురువారం సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చేందుకు తీసుకొచ్చిన సందర్భంలోనూ ఆయన కోర్టు వద్దకు వచ్చారు. అప్పుడే ఈ కేసులో తనపేరూ చేర్చారని తెలుసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది. సూర్యనారయణ ఫోన్లు, సహచరుల కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. ఆయన తలదాచుకునేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ పోలీసులు వెతుకుతున్నారు.
ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి విజయవాడ జిల్లా కారాగారంలో ఉన్న నలుగురిని లోతుగా విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందో వారి నుంచి రాబట్టాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఆ నలుగురికి 14రోజుల రిమాండ్: ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే ఆరోపణలపై.. ఎస్‌టీ అధికారులు కె.సంధ్య, మెహర్‌కుమార్, ఆఫీసు సబార్డినేట్ ఎం.సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ కేవీ చలపతి, సీనియర్ అసిస్టెంట్ కేఆర్ సూర్యనారాయణ, ఇతరులను నిందితులుగా పేర్కొన్నారు. బుధవారం సూర్యనారాయణ మినహా మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గురువారం విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి రాజశేఖర్ ముందు రిమాండ్ నిమిత్తం హాజరుపరిచారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయాధికారి.. నలుగురు నిందితులకు ఈనెల 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో పోలీసులు వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.