పోలవరం నిర్మాణంపై ఆందోళన - కీలక పనులపై కొరవడిన స్పష్టత Polavaram Construction Works Stopped: ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన పనులు ఏమీ చేయకుండానే.. ఒక ఏడాదిని కోల్పోతున్నామా. ఈ ఏడాది జూన్ నుంచి పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నవంబరు వచ్చింది. కీలకమైన నిర్మాణ పనుల సీజన్ ప్రారంభమవుతున్నా ఇప్పటికీ అనేక ముఖ్యాంశాలపై తుది నిర్ణయాలు కొలిక్కి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
పోలవరం నిర్మాణ గడువులు ఏటికేడు పెరుగుతూపోతున్నాయి. అయినా కొత్తగా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరగడం లేదు. పోలవరంలో ప్రధాన డ్యాం నిర్మాణానికి వరద కాలంలోనూ ఆటంకం లేకుండా పనులు చేసుకునేందుకు వందల కోట్లు వెచ్చించి ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు నిర్మించారు. ఎగువ డ్యాం నుంచి సీపేజీని సరిగా అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకోకపోవడంతో పోలవరంలో పెద్ద సమస్య తలెత్తింది.
పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించిన దేవినేని ఉమ - గోదావరికి పూజలు
సరైన నిర్ణయాలు లేక పనులు సాగడంలేదు: ప్రధాన డ్యాంలో అంచనాలకు మించిన సీపేజీ ముంచెత్తడంతో పనులకు బ్రేక్ పడింది. నవంబరు నుంచి వరదలు తగ్గాయి. లీకైన నీటిని కొంత గ్రావిటీ ద్వారా, మరికొంత ఎత్తిపోసి మళ్లిస్తున్నారు. కొన్ని కీలకాంశాలపై ఇప్పటికీ నిర్ణయాలు లేక పనులు ముందుకు సాగడం లేదు. అలా ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబరు వరకూ ప్రధాన డ్యాంలో పనులు ఆగిపోయాయి.
పోలవరంలో డయాఫ్రం వాల్ కొంతమేర దెబ్బతిందని నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ తేల్చింది. దెబ్బతిన్నంత మేర సమాంతరంగా మరో డయాఫ్రం వాల్ నిర్మించి, దాన్ని ప్రస్తుతం ఉన్న వాల్‌తో అనుసంధానం చేయొచ్చని సిఫార్సు చేసింది. దానిపై కేంద్ర జలసంఘం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాలి.
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం పెంచింది: కేంద్ర మంత్రి షెకావత్
పనుల ప్రారంభంపై కొరవడిన స్పష్టత: కొత్త డయాఫ్రం వాల్ రూ. 800 కోట్లతో నిర్మించాలనేది రాష్ట్ర ఇంజినీర్ల అభిప్రాయం. దెబ్బతిన్నంత మేర సమాంతరంగా కొత్తది నిర్మించి, మిగిలిన దాంట్లో పాతదానికి మరమ్మతులు చేసి రెండూ అనుసంధానం చేయాలనేదీ పరిశీలనలో ఉంది. ఇలా చేస్తే రూ.454 కోట్లు ఖర్చవుతుందని లెక్క. ఇప్పటి వరకూ కేంద్ర జలసంఘం, రాష్ట్ర అధికారులు కలిసి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇక ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతంలో గోదావరి గర్భం కోసుకుపోయింది. అక్కడ కొంతమేర ఇసుకతో నింపి వైబ్రోకాంపాక్షన్‌తో ఆ ప్రాంతాన్ని మునుపటి స్థాయికి తీసుకురావడానికి పనులు చేశారు. ఆ కింద నల్ల రేగడి నేలలున్నాయి. ఇలాంటి చోట పనులు చేపట్టే విషయంలో సాంకేతికంగా కేంద్ర జలసంఘం, నిపుణులు మార్గనిర్దేశం చేయాలి. అవి తేలితే తప్ప పనులు చేసే ఆస్కారం లేదని అధికారులు చెబుతున్నారు.
పనులు సాగుతాయా అనే సందేహాలు: కేంద్ర నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులూ జరపట్లేదు. ఫలితంగా సీజన్ ప్రారంభమవుతున్నా పనులేవీ చేపట్టేందుకు వీల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికిప్పుడు మొదలుపెట్టినా.. టెండర్లు పిలవడం, యంత్ర సామగ్రి సమకూర్చుకోవడం లాంటి సన్నాహాలకు 40 రోజులకు పైగా సమయం పడుతుంది. తర్వాత క్రిస్మస్, సంక్రాంతి.. ఆపై ఎన్నికల పరిస్థితులు వచ్చేస్తాయి. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే పోలవరంపై జగన్ సమీక్షలు అంతంతమాత్రం. అలాంటిది జనవరి తర్వాత ఇక పనులు సాగుతాయా అన్న సందేహాలు ఇంజినీరింగ్ అధికారుల్లోనూ ఉన్నాయి. దాంతో పోలవరం నిర్మాణంలో మరో కీలక ఏడాది కోల్పోయినట్లే అవుతుంది.
Neglect on Polavaram Residents Colony: ముఖం చాటేసిన ప్రభుత్వం... కాలనీల్లో కనీస సౌకర్యాల్లేక పోలవరం నిర్వాసితుల అవస్థలు