Petrol and Diesel Prices in Andhra Pradesh: 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎక్కడ సభ పెట్టినా జగన్.. పెట్రోల్, డీజిల్‌పై బాదుడేబాదుడంటూ... ఘోషించారు. పక్క రాష్ట్రాల కంటే లీటరుపై 5 నుంచి 7 రూపాయలు ఎక్కువని వాపోయారు. ఓ అన్నా.. ఓ అక్కా..! మీకు బైకులున్నాయా? ట్రాక్టర్లున్నాయా? పెట్రోలు, డీజిల్ పోయించి బిల్లులు తీసుకోండి..! ఇతర రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దులకు వెళ్లండంటూ ప్రేరేపించారు.
మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే ఆయన.. అవే మాటలు ఇప్పుడు చెప్పగలరా? ఏపీలోని పెట్రోలు, డీజిల్ ధరలను పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూడండని ప్రజలకు పిలుపునివ్వగలరా? మచ్చుకు.. కోనసీమ జిల్లా కేసనకుర్రుతో పోల్చితే.. పక్కనే యానాంలో పెట్రోలుపై 15 రూపాయల 77 పైసలు, డీజిల్‌పై 13 రూపాయల 23 పైసలు తక్కువన్న సంగతిని జగన్ అంగీకరించగలరా?.
ప్రజలకు పెట్రో మంట.. సర్కారుకు కాసుల పంట
CM Jagan Comments Petrol Rates in Opposition:పెట్రో ధరలు మన రాష్ట్రంలో ఉన్నట్లు మరెక్కడా లేవంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నాటి ప్రభుత్వంపై జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2019లో తానే సీఎం అయ్యాక.. పెట్రోలుపై 31 శాతం, లీటరుకు 2 రూపాయల అదనపు సుంకం, డీజిల్‌పై 22.5 శాతం లీటరుకు 2 రూపాయల అదనపు సుంకాన్ని పెంచేశారు. రోడ్డు సుంకం రూపంలో ఒక రూపాయి, దీనిపై వ్యాట్‌ను అదనంగా వడ్డించారు. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అయిన జగన్.. తన ప్రభుత్వ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలందరూ కోటీశ్వరులు అయ్యారని అనుకున్నారో ఏమో.. దేశంలో ఎక్కడా లేనంతగా పన్నుల భారాన్ని మోపారు.
పెట్రో ఛార్జీలనే రాష్ట్ర రాబడికి ఇంధన వనరుగా మార్చుకున్నారు. 2019-20తో పోల్చితే.. 2022-23 నాటికి.. నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వ రాబడి 61.57 శాతం పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో 2014-15తో పోల్చితే... 2018-19 నాటికి ఐదు సంవత్సరాలలో ఈ పెరుగుదల 22.87 శాతం మాత్రమే. అలాగని వైసీపీ వచ్చాక పెట్రో ఉత్పత్తుల వాడకం భారీగా పెరిగిందేమీ లేదు. నాలుగేళ్లలో 4.39 శాతం మాత్రమే పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో పెట్రో ఉత్పత్తులపై పన్నుల్లో రాష్ట్ర వాటాగా 16 వేల 429 కోట్లు, గ్యాస్, ఇతర ఉత్పత్తులపై మరో 290 కోట్ల రూపాయలు సమకూరాయి. అదనపు సుంకం, రోడ్డు సుంకం రూపంలో వసూలు చేస్తున్న ప్రభుత్వం.. రోడ్లపై గుంతలు కూడా పూడ్చడం లేదు.
Petrol Rates Increased: సామాన్యుడికి శాపంలా మారిన పెట్రో ధరలు
Petrol and Diesel Rates Hike in YSRCP Government:పెత్తందారు పాలనలో బాదుడంటే ఇలాగే ఉంటుందని జగన్ చెప్పకనే చెబుతున్నారు. చమటోడ్చే రైతులు, బైక్‌లపై ఊరూరా తిరుగుతూ సరుకులు అమ్ముకునే చిరు వ్యాపారులు, ఆటోడ్రైవర్లనూ వదల్లేదు. జనరేటర్లు వాడే ఆక్వా రైతులు, పరిశ్రమల యజమానులపై పెనుభారాన్ని మోపారు. ఇంధన ధరలు పెంచి వారి ఆదాయానికి కత్తెరేస్తున్నారు. జగన్ సీఎం అయ్యేనాటికి.. పెట్రోలు ధర విజయవాడలో లీటరు 76 రూపాయల 89 పైసలు. ఇప్పుడు 111 రూపాయల 50 పైసలు. లీటరుపై 34 రూపాయల 60 పైసలు పెరిగింది.
గ్రామాల్లో తిరుగుతూ వివిధ వస్తువులు అమ్ముకునే చిరు వ్యాపారి రోజుకు 2 లీటర్ల పెట్రోలు వాడినా.. గతంతో పోల్చితే అదనపు ఖర్చు సుమారు 70 రూపాయలు. నెలలో 25 రోజులు వ్యాపారం చేశాడనుకుంటే.. ఈ మొత్తం 17 వందల 50 రూపాయలు. ఏడాదికి 21 వేల రూపాయలు. అమ్మఒడి కిందో, వాహనమిత్ర కిందో సర్కారు ఇచ్చేదెంత? సామాన్యుడి నుంచి లాగుతోంది ఎంత? అన్నది ఈ లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి.