రైతులకు సకాలంలో విత్తనాలు సరఫరా చేయలేని వైకాపా ప్రభుత్వం.... తెదేపా హయాంలో లేనేలేని అవినీతిపై విచారణ కోసం తొందరపడుతోందని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె... ముఖ్యమంత్రి జగన్ కనీసం ఒక్కసారైనా విత్తనాల సమస్యపై సమీక్షించారా అని ప్రశ్నించారు. ఈ విషయంలో వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు సాకులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
'గృహ నిర్మాణ పథకంపై వైకాపాది తప్పుడు ప్రచారం' - riverse tendering
వైకాపా ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మరిచి... తెదేపా పాలనపై విచారణ జరపడానికే శ్రద్ధ చూపిస్తోందని పంచుమర్తి అనురాధ ఆరోపించారు.
తెదేపా హయాంలో గృహనిర్మాణ పథకంలో అవినీతి జరిగిందని వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. తుపాన్లు, భూకంపాలు తట్టుకునే సామర్థ్యంతో పాటు తక్కువ సమయంలో నిర్మించవచ్చనే ఉద్దేశంతోనే షీర్ వాల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇళ్లు నిర్మించామని స్పష్టం చేశారు. క్రిమినల్ కేసులున్న మంత్రులకు అవినీతి నిర్మూలన గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులిచ్చి సామాజిక న్యాయం చేసినట్లు చెబుతున్న జగన్.... కీలక సమీక్షల్లో వారిని ఎందుకు పక్కన కూర్చోబెట్టుకోవటం లేదో చెప్పాలని నిలదీశారు.