Politicians on GO 1: రోడ్డుషోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ ఈ ఏడాది జనవరి 2వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు జీవో నెం1 ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. జీవో నెం1పై పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Chandrababu on GO No 1 Dismission: హైకోర్టులో జీవో నెం1 కొట్టివేతపై స్పందించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అంతిమంగా గెలిచేది.. నిలిచేది అత్యున్నతమైన అంబేడ్కర్ రాజ్యాంగమే అని తెలిపారు. జగన్ లాంటి నాయకులు వస్తారని నాడే ఊహించి.. భారత రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యమే ఉన్నతమైనదని.. అధికారం తెచ్చిన అహంకారం, నియంత ఆలోచనలు దాని ముందు నిలబడవని మరోసారి స్పష్టమైందన్నారు. ప్రజలను, ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను.. ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై గొంతెత్తకుండా చేయాలనే దురుద్దేశ్యంతో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్1ను హైకోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
Lokesh on GO No 1 Dismission: హైకోర్టులో జీవో నెంబర్ 1 ని కొట్టివేయటంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో ఉన్న ఆయన ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఏ1 తెచ్చిన జీవో1ని హైకోర్టు కొట్టేసిందని.. ఫ్యాక్షన్ పాలనపై ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం ఇక చెల్లదని.. అంబేడ్కర్ రాజ్యాంగం నిరూపించిందని నారా లోకేశ్ కామెంట్ చేశారు.
YCP MP Raghurama on GO 1: రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన చీకటి జీవో నెం1ను హైకోర్టు కొట్టివేయడంపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. పిచ్చి కుక్క కాటుకి ఆలస్యంగానైన తగిలిన చెప్పు దెబ్బ అని కామెంట్ చేశారు. తీర్పు అంటూ వస్తే తప్పనిసరిగా కొట్టేస్తారు అని తాను ఎన్నోసార్లు చెప్పానని వ్యాఖ్యానించారు. 5 నెలలు ఆలస్యమైనా న్యాయం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచైనా తింగరి వేషాలు మానెయ్యాలని హితవు పలికారు. ఇటువంటి అరాచకాలపై హైకోర్టు త్వరగా స్పందించాలని.. ఈ 5 నెలల కాలంలో రాష్ట్ర పోలీసులు చేసిన అరాచకాలకు లెక్కేలేదన్నారు. ఇలా జరిగినందుకు ఈ ముఖ్యమంత్రి కాకుండా వేరే ఎవరైనా అయితే ఈపాటికి రాజీనామా చేసేవారని.. చూద్దాం మరి మన ముఖ్యమంత్రి ఏమి చేస్తారో అని వ్యాఖ్యానించారు.
CPI Rama Krishna on GO 1: హైకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. పాదయాత్ర, ర్యాలీ, సభలకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు. ప్రభుత్వం, పోలీసులు.. ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. చిన్న ఉద్యమం చేసినా ఈ ప్రభుత్వం సహించడం లేదని.. ప్రశాంతంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకు, ప్రతిపక్షాలకు ఉందని వ్యాఖ్యానించారు.
Pilli Manikya Rao on GO 1: ప్రతిపక్షాలు, ప్రజల గొంతునొక్కేందుకు జగన్ తీసుకొచ్చిన చీకటి జీవో 1 ను హైకోర్టు కొట్టేయడం ప్రజా విజయమని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు వ్యాఖ్యానించారు. జీవో నెం1 ఆధారంగా ప్రతిపక్షాలు, ప్రజలపై నిర్బంధంగా పెట్టిన తప్పుడు కేసుల్ని బేషరతుగా తీసేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. జగన్ అప్రజాస్వామిక పాలనపై న్యాయస్థానాలు వందల సార్లు మొట్టికాయలు వేసినా తన తీరు మార్చుకోలేదని పిల్లి మాణిక్యరావు అన్నారు.
ఇవీ చదవండి: