కరోనా వైరస్ మహమ్మారి గుంటూరు జిల్లా నరసరావుపేటలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఒక్క రోజులోనే పట్టణంలో 26 కేసులు నమోదవటంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 102కి చేరింది. రోజు రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనాకు కేంద్ర బిందువుగానున్న పట్టణంలోని వరవకట్టలో 81 మంది బాధితులు తేలారు. మిగిలిన 21 కేసులు పేటలోని వివిధ ప్రాంతాల్లో నమోదయ్యాయి. తొలుత పాజిటివ్ కేసు నమోదైన వరవకట్టపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయి దృష్టి సారించకపోవటంతో ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం తమకు శాపంగా మారిందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. వైరస్ వచ్చిన ప్రాంతంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా కట్టడి చేయడంలో అధికారులు శ్రద్ధ చూపలేదు. దాని పర్యావసానంగా ఇప్పుడు కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుందని చెబుతున్నారు. ఇంకా వరవకట్ట, రామిరెడ్డిపేట తదితర ప్రాంతాలకు చెందిన 500 మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. ఇంకెన్ని కేసులు నమోదవుతాయోనని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరవకట్టలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలో పర్యటించిన ఆయన ఇంటింటా సర్వేను పర్యవేక్షించారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ
కేసుల తీవ్రత నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై నరసరావుపేటపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్‌కుమార్ ఇప్పటికే పలుమార్లు పేటలో పర్యటించారు. ఐజీ ప్రభాకరరావు, ఎస్పీ విజయరావు పట్టణంలో పర్యటించారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. వైరస్ వ్యాప్తి మూలాలను గుర్తించటడంపై దృష్టి సారించారు.
ఏప్రిల్ 9న నరసరావుపేటలో తొలి కేసు నమోదైంది. కేసుల సంఖ్య ఆ వారంలోనే ఏడుకి చేరింది. నెమ్మదిగా పెరుగుతూ వస్తూ ఏప్రిల్ 20 నాటికి కేసుల సంఖ్య 25కి చేరింది.ఏప్రిల్ 20 తరువాత కేసుల ఉద్ధృతి పెరిగింది. కేసుల 25వ తేదీ నాటికి 44 కేసులు ఉండగా, నాలుగు రోజుల వ్యవధిలో ఒక్కసారిగా రెట్టింపు అయింది. బుధవారం పట్టణంలో నమోదైన 26 కేసుల్లో ఒక్క వరవకట్టలోనే 25 కేసుల నమోదు కావడం తీవ్రతను తెలియజేస్తోంది.
రోడ్లపైకి వస్తే క్వారంటైన్‌కే