CM REVIEWS ON ROADS : రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలి. ఇకపై ఏ రహదారి విస్తరించాలనుకున్నా రెండు వరసలుగా విస్తరించండి.. ఇదీ 2019 నవంబర్ 4న రహదారులపై సమక్షలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు.. 2021 జనవరి 10 నుంచి 45 రోజుల పాటు యుద్ధ ప్రాతిపదికన రహదారుల మరమ్మతులు చేపట్టాలి. రూ.500 కోట్లతో చేపడుతున్న మరమ్మతుల టెండర్లు 10లోపు పూర్తిచేయాలి. ఈ సంవత్సరం మొత్తం రోడ్ల మరమ్మతులపైనే దృష్టిపెడుతున్నాం.. ఇదీ 2021 జనవరి 5న కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ మాట్లాడిన మాటలు...
తొలుత గుంతలు లేకుండా రోడ్లు ఉండాలి. ఏ రహదారిపైనా గుంతలు లేకుండా చర్యలు చేపట్టాక, కార్పెటింగ్ పనులు పూర్తి చేయాలి. ఎంపిక చేసిన కొన్నే కాకుండా రాష్ట్రంలోని మొత్తం రహదారుల మరమ్మతులు చేయాలి. ఇంత చేశాక ఎవరూ విమర్శించే అవకాశం ఉండకూడదు. మరమ్మతులు చేయకముందు, తర్వాత పరిస్థితిపై ప్రయాణికులకు స్పష్టమైన తేడా కనిపించాలి. 2022 జూన్ నాటికి మరమ్మతులు, పునరుద్ధరణ పనులు పూర్తికావాలి.. ఇదీ 2021 నవంబరు 15న రహదారులపై సమీక్షలో సీఎం జగన్ కామెంట్లు...
ఆర్‌అండ్ బీ రోడ్లను బాగు చేసేందుకు దాదాపు 2,500 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ రోడ్ల కోసం 1,072.92 కోట్ల రూపాయల వ్యయం చేస్తున్నాం. పండ్ల చెట్లకే రాళ్ల దెబ్బలు అన్నట్లు మనపై విమర్శలు చేస్తున్నారు. వీటిని ఛాలెంజ్‌గా తీసుకొని ఎక్కడా గుంతలు లేని విధంగా రోడ్లను తయారు చేయాలి. గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి? బాగుచేసిన తర్వాత ఎలా ఉన్నాయో తెలిసేలా నాడు-నేడు ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేయాలి.. ఇదీ 2022 మే 11న రహదారులు, అభివృద్ధి పనులపై సమీక్ష సందర్భంగా జగన్ మాటలు..
ప్రతీ సమీక్షలోనూ ఎక్కడా గుంత కనిపించకూడదని, రాష్ట్రంలో మొత్తం రోడ్లు బాగుచేయాలని ముఖ్యమంత్రి జగన్ పదేపదే చెబుతునే ఉన్నారు. ఆయన ఆదేశాలతో రోడ్లన్నీ మిలమిలా మెరిసిపోతాయని ప్రజలు ఎదురుచూడటం, కొంతకాలం తర్వాత ఆ పరిస్థితి కనిపించకపోవడంతో యథావిధిగా గుంతల రోడ్లపై ప్రయాణాలు చేయడం అలవాటు చేసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి మూడు సంవత్సరాలు రోడ్లను పట్టించుకోలేదు. ఆ తర్వాత నుంచి రోడ్లపై దృష్టి పెట్టినా పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో రోడ్లపై ప్రయాణించాలంటేనే ప్రజలకు నరకం కనిపిస్తోంది.
ముందే రోడ్ల మరమ్మతులు చేయక :రాష్ట్రంలో జూన్ నుంచి నవంబరులోపు వానలకు దెబ్బ తిన్న రహదారుల్లో ఏర్పడిన గుంతలను డిసెంబరు నుంచి జూన్ లోపు పూడ్చాలి. ఒకవేళ రోడ్డంతా ఎక్కువ గుంతలు ఉంటే, దానిని పునరుద్ధరించాలి. అయితే ఇటువంటి దారులపై దృష్టి పెట్టడం లేదు. పలు నిధులు, ప్రాజెక్టులు కింద చేపట్టిన రోడ్లకు చెల్లింపులు లేకపోవడంతో.. వాటిలో పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. కనీసం మరమ్మతులు సైతం చేయడం లేదు. ఓ ప్రాజెక్టు కింద మంజూరైన రహదారికి రిపేర్లు చేస్తే అందుకయ్యే అదనపు ఖర్చు ఇచ్చే అవకాశం లేకపోవడంతో కాంట్రాక్టర్లు వాటి జోలికి వెళ్లడం లేదు.
పనులు జరగవు.. మరమ్మతులు: ఎన్డీబీ( న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్) ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో 3,013 కోట్ల రూపాయలతో 1,244 కి.మీ.రహదారులను విస్తరిస్తున్నారు. గుత్తేదారులతో రెండేళ్ల కిందట ఒప్పందం జరిగింది. అయితే బ్యాంకు రుణం 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 శాతం ఎలా చెల్లిస్తారనేది తేలకపోవడంతో గుత్తేదారులు ముందు పనులు చేయలేదు. కిందటి సంవత్సరం బ్యాంకు రూ.230 కోట్లు అప్పు ఇచ్చినా , ప్రభుత్వం అందులో రూ.100 కోట్లు చెల్లించి, మిగిలినవి వాడుకుంది. దీంతో గుత్తేదారులు ఈ పనులు వేగంగా చేయడం లేదు. గుంతలు పూడ్చేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు.
కేంద్ర రహదారి నిధి (CRF) కింద రాష్ట్రంలో 1,100 కి.మీ. మేర రోడ్ల విస్తరణ, పటిష్ఠపరిచే పనులు మంజూరయ్యాయి. ప్రతి సంవత్సరం కేంద్రం 350 కోట్ల రూపాయలను సీఆర్‌ఎఫ్ కింద రీయింబర్స్ చేస్తుండగా.. రూ.1,500 కోట్ల పనులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో అక్కడక్కడే పనులు జరుగుతున్నాయి. వీటిలో కూడా మరమ్మతులు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం వాటిని తిరిగి చెల్లిస్తుందని తెలిసినా స్టేట్ గవర్నమెంట్ సీఆర్‌ఎఫ్ పనులకు చెల్లించలేకపోతోంది.