ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీజీహెచ్‌కు సమకూరనున్న వైద్య పరికరాలు - జీజీహెచ్​కు నూతన వైద్య పరికరాల వార్తలు

గుంటూరు జీజీహెచ్​కు అదనంగా వైద్య పరికరాలు సమకూరనున్నాయి. ఎంపీ గల్లా జయదేవ్ తన నిధుల నుంచి కేటాయించిన రూ. 2 కోట్లలో ప్రస్తుతం రూ. 50 లక్షలతో పరికరాలు కొనేందుకు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో కొవిడ్ బాధితుల కష్టాలు తీరనున్నాయి.

new medical equipment ot guntur ggh
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల

By

Published : Jun 27, 2020, 5:16 PM IST

గుంటూరు జిల్లాలో కొవిడ్‌ రోగులు బాగా పెరుగుతున్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు బాధితుల తాకిడి రోజురోజుకూ అధికమవుతోంది. ఆయా ప్రాంతాల నుంచి అంబులెన్సుల్లో తీసుకొచ్చే వయస్సు పైబడిన రోగులను వార్డులోకి తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా వీల్‌ఛైర్లు అందుబాటులో లేని పరిస్థితి ఉంది. మరోవైపు కొవిడ్‌ ఆసుపత్రిలో వినియోగించే పరికరాలను సాధారణ పేషెంట్లకు వినియోగించకూడదు. దీంతో వీరికి ఆయా పరికరాలను ప్రత్యేకంగా సమకూర్చుకోవాల్సి వస్తోంది.

కరోనా బాధితులకు వైద్యసేవలు అందించటానికి, వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయడానికి ప్రధానంగా డిజిటల్‌ బీపీ పరికరాలు, ఈసీజీ యంత్రాలు, ఫింగర్‌ ఫల్స్‌ ఆక్సోమీటర్లు వంటివి అవసరం. ఇవి కొరతగా ఉన్నాయి. రక్తపోటు, గుండె, శ్వాస సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే బాధితులకు వైద్యసేవలు అందించటానికి ఇవి అవసరం. ఆయా పరికరాల కోసం జీజీహెచ్‌ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటికి ఆసుపత్రి పాలనా ఆమోదం పొంది ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా కొనుగోలు చేయడానికి ఆసుపత్రి యంత్రాంగం దస్త్రాన్ని రూపొందించింది.

ఎంపీ నిధులతో..

కొవిడ్‌ బాధితులకు వసతులు, సౌకర్యాలు కల్పించాలని జీజీహెచ్‌కు 3 నెలల కిందట ఎంపీ గల్లా జయదేవ్‌ తన నిధుల నుంచి రూ.2 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఆ నిధుల నుంచి పరికరాల కోసం రూ.50 లక్షలకు పైగా వెచ్చించనున్నారు. కొవిడ్‌ బాధితులకు శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీంతో వారికి శ్వాస పీల్చడానికి వెంటిలేటర్ల సౌకర్యం తప్పనిసరి. ఇప్పటికే ఆసుపత్రిలో ఉన్న వెంటిలేటర్లతో కూడిన పడకలు పూర్తిగా బాధితులతో నిండిపోయాయి.

ప్రస్తుతం అదనంగా 6 వెంటిలేటర్లు, ఈసీజీ మిషన్లు, మల్టీఛానల్‌ మోనిటర్లు వంటివి కొనుగోలు చేయనున్నారు. ఈ పరికరాలను ఇంతకుముందే సమకూర్చుకుని ఉండి ఉంటే ప్రస్తుతం ఆసుపత్రికి ఎంతమంది రోగులు వచ్చినా వైద్యసేవలు అందించటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ప్రస్తుతం ప్రతి పరికరం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి ఉన్నతాధికారులు ఆయా పరికరాలను కొనుగోలు చేయటానికి చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి...

కరోనా వేళ.. ఆన్​లైన్ విద్యాబ్యాసం

ABOUT THE AUTHOR

...view details