ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాగుకు దన్నుగా..!

రైతుల కోసం యువ ఇంజినీర్లు కొత్త ఆవిష్కరణలు చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగపడే పరికరాలను రూపొందించారు.

Agriculture

By

Published : Feb 23, 2019, 8:10 AM IST

రైతన్నకు సాంకేతికత సహాయం
దేశానికి అన్నం పెట్టే రైతుకు ఖర్చు తప్ప ఆదాయం మిగలట్లేదు.కష్టపడి పండించిన పంటకు పెట్టుబడి సైతం రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. అలాంటి రైతన్నకు తమ వంతు సాయం చేద్దామనే ఆలోచనతో యువ ఇంజనీర్లు ముందుకొచ్చారు. సాంకేతిక విద్యతో వ్యవసాయ ఆవిష్కరణలు తయారు చేశారు. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ప్రయోజనం కలిగేలా పరికరాలను రూపొందించారు.

యువతలోని సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశంతో గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం ఏటా 'సృజనాంకుర' కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన వందలాది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ఆలోచనలకు పదును పెట్టి రూపొందించిన ఆవిష్కరణలను ప్రదర్శించారు.

50శాతం తక్కువ ఖర్చుతో 'నీరు'

కర్షకుడి కష్టం విలువ తెలిసిన ఇంజినీర్లు... పరికరాలకు ఆధునికత జోడించి, ఎక్కువ లాభం చేకూరేలా రూపుదిద్దారు. నీటి పారుదల కోసం ప్రస్తుతం వినియోగిస్తున్న డీజిల్ ఇంజన్లకు ప్రత్యామ్నాయంగా గ్యాస్​తో నడిచే ఇంజిన్ తయారు చేశారు. ఈ ఆవిష్కరణ ద్వారా 50 శాతం తక్కువ ఖర్చుతో పొలానికి నీరు పారించొచ్చు. గంటకు లీటరు ఇంధనం బదులు కిలో గ్యాస్​తో ఇంజిన్ 2 గంటలు పనిచేస్తుంది. కర్బన ఉద్గారాలు తగ్గి, పర్యావరణానికి మేలు జరుగుతుందని విద్యార్థులు చెబుతున్నారు.

కంది విత్తు యంత్రం

పిచికారీ యంత్రానికి మార్పులు చేసి దాన్ని ట్రాక్టర్​కు అమర్చటం ద్వారా విత్తు నాటే పరికరం తయారు చేశారు. దీని వల్ల కంది రైతులకు ఎక్కువ ఉపయోగం ఉంటుందని విద్యార్థులు తెలిపారు. వేల రూపాయల్లోనే ఈ యంత్రం అందుబాటులోకి వస్తుందని వారు చెబుతున్నారు.కంది విత్తు యంత్రం పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆవిష్కర్తలు లోకేశ్, రవిచంద్ర, ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details