Nara Lokesh Legal Battle Against YCP: టీడీపీ, టీడీపీ నేతలపైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని గట్టిగా ప్రతిఘటించాలని తెలుగుదేశం నిర్ణయించింది. న్యాయపోరాటం చేసేందుకు స్వయంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రంగంలోకి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సమన్వయకర్త గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీతలపై క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మంగళగిరి అడిషినల్ మేజిస్ట్రేట్ ముందు లోకేశ్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. దీంతో ఈ నెల 13, 14 న యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది.
Lokesh Legal Battle: న్యాయపోరాటానికి సిద్ధమైన లోకేశ్.. పాదయాత్రకు రెండ్రోజులు బ్రేక్
Nara Lokesh Legal Battle Against YCP: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురు, శుక్రవారాల్లో యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలపై న్యాయపోరాటం చేయనున్నారు. దీంతో పాదయాత్రకు లోకేశ్ బ్రేక్ ఇచ్చారు.
తనపైనా, తన కుటుంబంపైనా అసత్య ఆరోపణలని ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై యువనేత నారా లోకేశ్ న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో కూడా తప్పుడు వార్తలు రాస్తూ, తనని అప్రతిష్ఠపాలు చేయడమే లక్ష్యంగా పని చేస్తోందని సాక్షి మీడియాపై కూడా లోకేశ్ పరువునష్టం దావా వేశారు. గత సంవత్సరం నందమూరి తారక రామారావు కుమార్తె, నారా భువనేశ్వరి సోదరి కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఆత్మహత్యపై వైసీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి.. లోకేశ్‌పై సామాజిక మాధ్యమాల్లో వివిధ పోస్టులు పెట్టారు. ఉమామహేశ్వరి మరణానికి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45లోని సర్వే నెంబర్ 273, 274, 275, 276 లలోని 5.73 ఎకరాల భూమి వివాదమే కారణమనే ప్రచారం చేశారు. అలాగే హెరిటేజ్ సంస్థలో 500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన ఉమామహేశ్వరిని మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నారంటూ మరో దాన్ని తెరమీదకు తెచ్చారు.
అలాగే ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా గత ఏడాది నిర్వహించిన మీడియా సమావేశంలో హెరిటేజ్ సంస్ధ ద్వారా చంద్రబాబు కుటుంబం సారా పరిశ్రమ నడుపుతున్నారంటూ ఆరోపించారు. పోతుల సునీత చేసిన వ్యాఖ్యలు, గుర్రంరెడ్డి దేవేందర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులపై లోకేశ్.. మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. వీరిద్దరిపై దాఖలు చేసిన కేసుల్లో ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ కేసులో పిటిషనర్ అయిన నారా లోకేశ్ తన వాంగ్మూలాన్ని మంగళగిరి అడిషినల్ మేజిస్ట్రేట్ కోర్టులో 14వ తేదీ నమోదు చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ సాయంత్రం పాదయాత్ర ముగిశాక అమరావతి రానున్న లోకేశ్.. రేపు, ఎల్లుండి విరామం ప్రకటించారు. 15వ తేదీ నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు.