MUNUGODE BYPOLL COUNTING: తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో.. తెరాస ఆధిక్యంలో కొనసాగుతోంది. పద మూడో రౌండ్‌లోనూ అధికార పార్టీ జోరు చూపించింది. ఫలితంగా 9,092 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతోంది. పదమూడో రౌండ్‌లో అధికార పార్టీకి 1,285 ఓట్ల ఆధిక్యం లభించింది. తెరాసకు 6,691 ఓట్లు రాగా.. భాజపాకు 5,406 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 13 రౌండ్లకు కలిపి గులాబీ పార్టీకి 88,696 ఓట్లు, భాజపాకు 79,604 ఓట్లు వచ్చాయి.
అంతకుముందు చౌటుప్పల్ మండలానికి సంబంధించి.. 4 రౌండ్లలో అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్‌లో భాజపాపై తెరాస ఆధిక్యం ప్రదర్శించింది. రెండు, మూడో రౌండ్‌లలో తెరాసపై భాజపా ఆధిక్యతను ప్రదర్శించింది. ఇక ఆఖరి నాలుగో రౌండ్‌లో భాజపాపై తెరాస ముందంజలోకి వచ్చింది. మొత్తంగా చౌటుప్పల్‌కు సంబంధించి నాలుగు రౌండ్‌లలో తెరాస, భాజపా.. చెరి సగం రౌండ్లలో ఆధిక్యతను ప్రదర్శించాయి. చౌటుప్పల్ మండలం లెక్కింపు పూర్తి కావడంతో 3 రౌండ్లలో సంస్థాన్ నారాయణపురం ఓట్లు లెక్కించారు. ఈ 3 రౌండ్లలోనూ గులాబీకే ఓటర్లు పట్టం గట్టారు.