ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మౌనం వీడాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల సమావేశానికి హాజరయ్యారు. గతంలో వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
దివంగత నేత.. నాటి సీఎం రాజశేఖర్రెడ్డి వర్గీకరణకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన విషయాన్ని మంద కృష్ణ మాదిగ గుర్తుచేశారు. వైకాపా ఏర్పడిన సమయంలో ఇడుపులపాయలో నిర్వహించిన సమావేశంలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారన్నారు. వర్గీకరణను రాష్ట్రాలే చేసుకోవచ్చునని సుప్రీం కోర్టు తీర్పునిచ్చినా... సీఎం జగన్ స్పందించటం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని.. నేడు జగన్మోహన్ రెడ్డి సైతం అదే తీరులో సాగుతున్నారా అనే సందేహం పల్లెల్లో ఉందని చెప్పారు.