ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికలు - thadikonda parishth elections

గుంటూరు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 47.68శాతం పోలింగ్ నమోదైంది. దుర్గి మండలంలో అత్యధికంగా 70.45 శాతం పోలింగ్ నమోదు కాగా... భట్టిప్రోలు మండలంలో అత్యల్పంగా 34.19 శాతం ఓటింగ్ నమోదైంది.

mptc, zptc elections completed in guntur district
గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికలు

By

Published : Apr 8, 2021, 10:57 PM IST

గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికలు

గుంటూరు జిల్లాలో కొన్నిచోట్ల చెదురుముదురు ఘటనలు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 47.68శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 571 ఎంపీటీసి, 45 జడ్పీటీసి స్థానాలకు పోలింగ్ జరిగింది. 571 ఎంపీటీసి స్థానాలకు 14వందల 18మంది... 45 జడ్పీటీసీ స్థానాలకు 191మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. జిల్లాలో 2 వేల 470 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దుర్గి మండలంలో అత్యధికంగా 70.45 శాతం పోలింగ్ నమోదు కాగా... భట్టిప్రోలు మండలంలో అత్యల్పంగా 34.19 శాతం ఓటింగ్ నమోదైంది.

తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించిన ప్రభావం పోలింగ్ పై కనిపించింది. ప్రధాన పార్టీ పోటీకి దూరంగా ఉంటామని చెప్పటం ఎన్నికలపై ఆసక్తి కోల్పోయేలా చేసింది. ఫలితంగా కొన్నిచోట్ల పోలింగ్ శాతం భారీగా పడిపోయింది. పలుచోట్ల అధికార వైకాపా నేతల దాడులు కొనసాగాయి. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 16చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కొలకలూరులో...

తెనాలి మండలంలోని కొలకలూరు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారులు, వైకాపా నేతల మధ్య ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు... ఇరువర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది.

నరసరావుపేటలో...

నరసరావుపేట మండలంలో గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ పర్యటించారు. మండలంలోని కేసానుపల్లి, ములకలూరు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే అంశంపై ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇరుకుపాలెంలో...

ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం పోలింగ్ కేంద్రంలో పోలింగ్ జరుగుతున్న తీరును గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద అవాంఛనీయ ఘటనలు జరగుకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

తాడికొండ నియోజకవర్గంలో...

నియోజకవర్గంలోని తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మేడికొండూరు మండలంలో 55శాతం, ఫిరంగిపురం మండలంలో 57 శాతం, తాడికొండ మండలంలో 60 శాతం పోలింగ్ నమోదైంది. మేడికొండూరు మండలంలోని పేరేచర్ల, డోకిపర్రు, మేడికొండూరు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలించారు.

రేపల్లె నియోజకవర్గంలో...

నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా.. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు చెరుకుపల్లి మండలంలో 59.15 శాతం, నగరం మండలంలో 63.14 శాతం, రేపల్లె మండలంలో 61.28 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

రేపల్లె నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా.. అందులో నిజాంపట్నం మండలంలోని 17 స్థానాలు, చెరుకుపల్లి మండలంలో ఒక స్థానం, నగరం మండలంలో ఒక స్థానం, రేపల్లె మండలంలో రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రేపల్లె మండలం నల్లూరిపాలెంలో పోటీలో ఉన్న అభ్యర్థి చనిపోవడంతో ఎన్నికలు నిలిచిపోయాయి.

పల్నాడు ప్రాంతంలో...

పల్నాడు ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన ఓటింగ్... మధ్యాహ్నానికి జోరందుకుంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో స్థానిక గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

రోలుగుంటలో విషాదం... వివాహిత ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details