గుంటూరు జిల్లాలో లాక్ డౌన్ కారణంగా 50 రోజులకు పైగా మిర్చి యార్డులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన మిర్చి పంట.. కోటి బస్తాలకు పైగా శీతల గోదాముల్లో నిలిచిపోయింది. ఈ విషయంపై ఈటీవి-ఈనాడులో వచ్చిన కథనాలతో మార్కెటింగ్ శాఖ అప్రమత్తమైంది. మిర్చియార్డు తిరిగి తెరవటంపై అధికారులు, వ్యాపారులు, కూలీలతో కమిషనర్ సమావేశమయ్యారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 4వ విడత లాక్ డౌన్ లో ఆంక్షలు సడలించిన నేపథ్యంలో యార్డులో క్రయవిక్రయాల ప్రారంభానికి సాధ్యాసాధ్యాలపై చర్చించారు.
కోయంబేడు మార్కెట్ ద్వారా రాష్ట్రంలోని పలుజిల్లాల్లో కరోనా కేసులు రావటంతో జిల్లాలో ఏం చేయాలని అధికారులు సమాలోచనలు జరిపారు. పూర్తి జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు మిర్చి అమ్మకాలకు ప్రత్యామ్నాయ మార్గాలపై సమావేశంలో చర్చించారు. వ్యాపారులు, ఏంజెట్లను రెండుగా విభజించి రోజు మార్చి రోజు కొనుగోళ్లు జరిపేలా చూడాలనే ప్రతిపాదన వచ్చింది. దాని ద్వారా యార్డులో ఉండేవారి సంఖ్య సగానికి సగం తగ్గుతుంది. అలాగే వ్యాపార లావాదేవీల్ని వికేంద్రీకరించటం రెండో ప్రతిపాదన.