రాష్ట్రంలో దశల వారీగా సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి, హోంమంత్రి సుచరిత వ్యాఖ్యానించారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజీ 151వ జయంతి వేడుకల్లో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లఘు చిత్రాల పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. జగన్ పాదయాత్ర సమయంలో మహిళలు కోరిన విధంగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని దశల వారీగా, డ్వాక్రా మహిళల రుణాలను నాలుగు దశలలో మాఫీ చేస్తామని మంత్రి నారాయణ స్వామి స్పష్టం చేశారు.
మద్యపానం వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవటంతో పాటు, మహిళలపై గృహహింస, నేరాలు పెరిగేందుకు కారణమవుతుందని హోంమంత్రి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయం, వాలంటరీ వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలో ప్రజలకు అనుభవ పూర్వకంగా అందిస్తున్నామని వివరించారు.