గుంటూరులో భూగర్భ డ్రైనేజీ, రహదారుల పరిస్థితిని మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. మూడేళ్ల క్రితం భూగర్భ డ్రైనేజీ పనులు మొదలైనా సక్రమంగా జరగలేదని తెలిపారు. పద్ధతి లేకుండా పనులు చేయడం వల్లే రహదారులు దారుణంగా తయారయ్యాయని అన్నారు. భూగర్భ డ్రైనేజీకి రూ.391 కోట్లు ఖర్చుపెట్టినా పనులు జరగలేదన్న ఆయన... డ్రైనేజీ పనులు పూర్తికాక పారిశుద్ధ్య సమస్యలు తలెత్తాయన్నారు. రాష్ట్ర ముఖ్య పట్టణంలో ఇలాంటి పరిస్థితి ఉండకూడదన్న బొత్స.. ఈ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడించారు. గుంటూరు నగరం సమగ్రాభివృద్ధి దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
అవినీతి జరిగిందని అనలేదు..
భూగర్భ డ్రైనేజీ పనులు గడువు వచ్చే నెలతో పూర్తవుతాయన్న మంత్రి.. ఇప్పటివరకూ 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని వెల్లడించారు. గుత్తేదార్లను మార్చాలనే ఆలోచన తమకు లేదని పేర్కొన్నారు. అత్యవసరమైన పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతీ పనికి రివర్స్ టెండరింగ్ సాధ్యం కాదని.. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సచివాలయ వ్యవస్థ పూర్తిగా ఏర్పాటు కావాలని అన్నారు. వచ్చే ఏడాదిలో ఎన్నికలు నిర్వహిస్తామన్న మంత్రి.. రాజధానికి సంబంధించి రూ.9 వేల కోట్ల పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. అందులో రూ.5,400 కోట్ల పనులు పూర్తయ్యాయని.. మొత్తం రూ.40 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల అవినీతికి తలుపులు తెరిచారని మాత్రమే తాను చెప్పానని... రూ.30 వేల కోట్ల అవినీతి జరిగిందని తాను ఎక్కడా అనలేదని వివరించారు.