Where Is Minimum Support Price: కేంద్రం ఖరీఫ్, రబీల్లో కలిపి 24 పంటలకు మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. ఆ జాబితాలో లేని పంటలకు తామే మద్దతు ధర ప్రకటించి కొంటామని ఎన్నికల్లో వైకాపా హామీ ఇచ్చింది. 2019-20 పంటకాలానికి సంబంధించి 2020 జనవరిలో కొన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. జాతీయ స్థాయిలో వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ ఏటా మద్దతు ధరలను కేంద్రానికి సిఫార్సు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా... వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ కు మద్దతు ధరల్ని సిఫార్సు చేస్తుంది. 2022-23 సంవత్సరంలో ధాన్యానికి 2,933 రూపాయలు, జొన్నకు 3,334, రాగులుకు 4,252, పెసరకు 9,756, నువ్వులకు 10,013, పత్తికి 8,551 చొప్పున ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. అయితే... తాము ప్రకటించే పంటలకు అదే తీరులో పెంచాలనే విషయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మరచింది.
మద్దతు ధరలు పెంచకపోగా.. తాము ప్రకటించిన ధరలకైనా రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా అంటే.. అదీ లేదు. 2019-20లో 972 టన్నుల ఉల్లి, 12వేల టన్నుల అరటి, 3,600 టన్నుల బత్తాయి, 1,425 టన్నుల టమాటానే కొనుగోలు చేసింది. రెండేళ్లుగా సేకరించిన దాఖలాలే లేవు. అరటికి కిలోకు 8 రూపాయలు ప్రకటించినా కొవిడ్ సమయంలో కిలో 4 చొప్పునే కొనడం మద్దతు ధరల అమలు తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 66వేల కోట్ల జీవీఏ అందించే ఆక్వారంగం విషయంలోనూ ప్రభుత్వం మద్దతు ధరల్ని అమలు చేయట్లేదు. వంద కౌంటు రొయ్యకు ఉత్పత్తి వ్యయానికి తగినట్లుగా నిర్ణయించలేదు. కిలోకు 30 రూపాయలు తగ్గించి 240 చొప్పున నిర్ణయించి తర్వాత 210కి కుదించింది. అదీ అమలు కావట్లేదు..