Severity of heart attacks: సాధారణంగా ఎదురయ్యే గుండెపోటు తీవ్రత కంటే ఈ కాలంలో ముప్పు 50 శాతం అధికంగా ఉంటుందని వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు. చలిగా ఉందనే కారణంతో నడక సహా ఇతర ఆరోగ్యకరమైన అలవాట్లను వాయిదా వేయకుండా, సమయాల్లో మార్పు చేసుకొని కొనసాగించాలని సూచిస్తున్నారు.
గుండెపోటు ముప్పు ఎక్కువ
-డాక్టర్ రామక శ్రీనివాస్, సీనియర్ కార్డియాలజిస్ట్, వరంగల్
చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రక్తం చిక్కబడుతుంది. శ్వాస నాళాలు కుదించుకుపోయినట్లే.. గుండెలోని రక్తనాళాలు కూడా ముడుచుకుపోతాయి. రక్తపోటులో మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా రక్తసరఫరా కోసం గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. రక్తంలో ‘కెటాకెలోమిన్స్’ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. దీంతో గుండె రక్తనాళాల్లో అప్పటికే పూడికలుంటే.. ఆ పూడికలపై రక్తం గడ్డకట్టి గుండెపోటుకు దారితీసే ప్రమాదముందని శాస్త్రీయంగా నిర్ధారణ అయింది.
గుండెజబ్బుల బాధితుల్లో 40 ఏళ్ల లోపు వారిలో ఈ ముప్పునకు ప్రధాన కారణం పొగాకు వాడకమేనని ఒక అధ్యయనంలో వెల్లడైంది. చలిని తట్టుకొనేందుకు కొందరు స్మోకింగ్, ఆల్కహాల్‌ను మోతాదుకు మించి తీసుకుంటుంటారు. గుండె వేగాన్ని, లయను నియంత్రించే నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం పడడం వల్ల గుండె స్పందనల్లో లయ తప్పుతుంది. అత్యంత వేగంగా కొట్టుకొంటుంది. దీన్ని ‘అర్రిథ్‌మియా’ అని అంటారు.
ఈ పరిస్థితుల్లో చాలామంది తెలియకుండానే నిద్రలోనే చనిపోతుంటారు. యువతతో పోల్చితే వృద్ధుల్లో చలికాలంలో ఆకస్మిక మరణాలు ఎక్కువ. మహిళల కంటే పురుషుల్లో అధికంగా గుండెపోటు మరణాలను చూస్తున్నాం. కొందరిలో పొగమంచు, వాతావరణ కాలుష్యం కారణంగా ఛాతీలో ఇన్‌ఫెక్షన్ తీవ్రమవుతుంది. వీరిలోనూ గుండెపోటు వచ్చే అవకాశాలెక్కువగా ఉంటాయి.
గుండెపోటు రాకుండా ఉండాలంటే ధూమపానం ఆపేయాలి. మద్యాన్ని మోతాదుకు మించి తీసుకోవద్దు. చలికాలంలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది. స్వల్ప మోతాదులో ఎక్కువసార్లు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. రక్తంలోని చక్కెరస్థాయుల్లోనూ హెచ్చుతగ్గులుంటాయి. గుండెజబ్బు, మధుమేహం, అధిక రక్తపోటుకు ఇప్పటికే మందులు వాడుతున్నవారు. డోసు హెచ్చుతగ్గులపై వైద్యుణ్ని సంప్రదిస్తే మంచిది.