ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్టీఆర్ పిలుపు స్ఫూర్తిగా కదలిరండి - రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకోవడమే అసలైన నివాళి - venkaiah naidu

Leaders Tribute to Senior NTR: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ‘పలువురు నేతలు సామాజిక మాధ్యమాల ద్వారా ఆయనను స్మరించుకున్నారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కోట్లాది హృదయాల్లో కొలువైన కారణ జన్ముడికి జోహార్లు అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

Leaders_Tribute_to_Senior_NTR
Leaders_Tribute_to_Senior_NTR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2024, 4:53 PM IST

Leaders Tribute to Senior NTR: పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమసమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే కర్తవ్యం కావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) పిలుపునిచ్చారు. బలహీన వర్గాల అణచివేత, పేదలను ఇంకా పేదలుగా మారుస్తున్న పాలన, సమాజంలో ఏ ఒక్కరికీ దక్కని భద్రతలతో తెలుగునేల అల్లాడుతుందని అన్నారు. తిరిగి రామరాజ్య స్థాపనకు ఎన్టీఆర్ స్ఫూర్తిగా మనందరం కదలాలన్నారు.

'తెలుగుదేశం పిలుస్తోంది. రా కదలిరా' అని ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా తను 'రా కదలిరా' అని పిలుపునిచ్చానన్నారు. తెలుగు ప్రజలరా రండి, ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకోవడమే ఎన్టీఆర్​కు అసలైన నివాళి అని పేర్కొన్నారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అని కొనియడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి చంద్రబాబు నివాళులు అర్పించారు. ఒకే ఒక జీవితం, రెండు తిరుగులేని చరిత్రలు ఎన్టీఆర్​వి అని గుర్తుచేసుకున్నారు.

కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతుబిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు అని కొనియాడారు. తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది అని కితాబిచ్చారు. తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్ అని అన్నారు.

సంక్షేమం అన్న పదానికి మారు పేరు ఎన్టీఆర్ : పురందేశ్వరి

Venkaiah Naidu About Nandamuri Taraka Rama Rao: ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు అని అన్నారు. సమాజంపై వారు చెరగని ముద్ర వేశారని, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుకు వెలుగులద్దిన దివిటీ అని పేర్కొన్నారు.

శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు తదితర పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ లీనమైన తీరు ఆయన్ను వెండి తెర ఇలవేల్పు నుంచి ఇంటింటి ఇలవేల్పుగా మార్చిందని తెలిపారు. సినిమాలను ప్రజల్లో మార్పు తెచ్చే శక్తిమంతమైన మాధ్యమంగా గుర్తించి, దాన్ని సద్వినియోగం చేసి, బలమైన పాత్రల ద్వారా ఎన్నో సామాజిక సమస్యలపై ప్రజల్లో ఎన్టీఆర్ అవగాహన కల్పించారన్నారు.

నటుడు గానే కాకుండా, నాయకుడిగానూ తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. నిరంకుశత్వానికి ధైర్యంగా ఎదురొడ్డి దేశ రాజకీయాలను మలుపు తిప్పిన మహానేత అని, రాజకీయాల్లో ఎన్టీఆర్ చేపట్టిన సంస్కరణలు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రిగా సుపరిపాలనకు తీసుకున్న విప్లవాత్మక చర్యలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని గుర్తు చేసుకున్నారు.

'తారకరాముడు నవరసాలకు అలంకారం - నవయువతకు మార్గదర్శనం'

మహిళలకు ఆస్తిలో సమాన వాటా, స్థానిక సంస్థల్లో బడుగు వర్గాలకు రిజర్వేషన్లు సహా వివిధ చర్యలతో సమాజంలో వివిధ వర్గాలకు వారు సాధికారికత కల్పించారన్నారు. పాలనలో ఎన్టీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని, సమాఖ్య వ్యవస్థ కోసం పాటుపడి, దేశ రాజకీయాల్లో పెను మార్పులకు కేంద్రంగా నిలిచి మేటి నేతగా ఎదిగారని అన్నారు.

ఎక్కడో పల్లెలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా, దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన మేటి నేతగా ఎదగడం సామాన్యం కాదని తెలిపారు. ఎంతో అకుంఠిత దీక్ష, ఉత్తమ జీవనశైలి, దేశం, సమాజం, ప్రజల పట్ల ఎంతో నిబద్ధత ఉంటే తప్ప సాధ్యం కాదని, అది ఎన్టీఆర్​కు మాత్రమే చెల్లుతుందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని నేటి తరం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

Nara Lokesh about Sr NTR: తెలుగుజాతి ఖ్యాతి మహానాయకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. కోట్లాది హృదయాల్లో కొలువైన కారణ జన్ముడికి జోహార్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details