రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని భూములు, స్థలాల మార్కెట్ విలువలను పెంచి సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ చేయబోతోంది. గుంటూరు జిల్లాలో ధరల పెంపుదలకు సంబంధించిన దస్త్రంపై జిల్లా సంయుక్త పాలనాధికారి సంతకం చేశారు. జిల్లా సంయుక్త పాలనాధికారి, జడ్పీ సీఈవో, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలతో కూడిన కమిటీలు జిల్లాలో ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను అంచనా వేసి గతంలో ఉన్న ధరలపై బహిరంగ మార్కెట్ ధరలు, అక్కడ స్థిరాస్తిపై జరుగుతున్న వ్యాపారం, పట్టణ ప్రాంత విస్తరణ, పారిశ్రామికీకరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నూతన ధరలను ప్రతిపాదించారు. ఇప్పటికే పెంచనున్న ధరలను ప్రజలకు అందుబాటులో ఉంచి వాటిపై అభ్యంతరాలను శాఖ స్వీకరించింది. ప్రతి పట్టణంలో ప్రాంతాల వారీగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థలాలకు చదరపు గజానికి, గృహాలకు చదరపు అడుగుకు ప్రాంతాలు, డోరు నంబర్ల వారీగా పెంచిన నూతన ధరలను ఆ శాఖ వెబ్‌సైట్‌లో పెట్టారు.
కరోనా కారణంగా ధరలను స్వల్పంగానే పెంచారు. గతేడాది అంతగా రిజిస్ట్రేషన్లు జరగని ప్రాంతాల్లో పెంపుదల జోలికి పోలేదని రిజిస్ట్రేషన్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి నూతన ధరల ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తామని అధికారవర్గాలు తెలిపాయి. జిల్లాలో గుంటూరు, తెనాలి, నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ఒకటి, రెండు శాతాలు, మరికొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 17.65 శాతం పెంచారు. సగటున ఈ పెంపుదల జిల్లాలో 10 శాతం వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అమరావతి జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో ఇప్పటికే ధరలు ఎక్కువగా ఉన్నందున అక్కడ పెంచలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లా నుంచి రూ.786.07 కోట్లు ఆదాయ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గతేడాది లక్ష్యం రూ.1137.76 కోట్లుగా ఉంది.