Super Star Krishna: నానక్‌రాంగూడతో నటశేఖర కృష్ణకు ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కడ ఆయన 90వ దశకంలోనే స్థానిక రైతుల నుంచి స్థలాన్ని కొనుగోలు చేశారు. అందులో ఆదిలో ఇంటిని నిర్మించారు. ఐటీ సంస్థలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రాకపూర్వమే ప్లానెట్ టెన్ పేరుతో వినోద కేంద్రం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని ప్లానెట్ టెన్ కూడలిగా స్థానికులు చెబుతుంటారు. కొన్నాళ్ల తర్వాత అక్కడే భవనం నిర్మించి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. పుష్కర కాలానికి పైగా కృష్ణ, విజయనిర్మల దంపతులు అక్కడే నివాసం ఉన్నారని గ్రామస్థులు తెలిపారు. ఈ క్రమంలో వారికి గ్రామంతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. స్థానికులకు సహకారం అందించే వారు. వివాహాలు తదితర శుభకార్యాలకు ఎవరు పిలిచినా దంపతులిద్దరూ వచ్చేవారని గ్రామస్థులు చెప్పారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
అయ్యప్పస్వామి పూజలో..: గ్రామంలో ఏటా జరిగే అయ్యప్ప స్వామి పూజకు కృష్ణ దంపతులిద్దరూ వచ్చి అన్నదానం చేసేవారు. దివ్యజ్యోతి పేరుతో ఆడియో సీడీలను కృష్ణ చేతుల మీదుగానే ఆవిష్కరించేవారు. స్థానిక పోచమ్మ దేవాలయానికి సహకారం అందించేవారు. అమ్మవారి అలంకరణ కోసం వారు వెండి ఆభరణాలు అందజేశారని బస్తీ వాసులు తెలిపారు.